భారత్‌కు ఫైటర్లు : ముందంజలో బోయింగ్‌

4 Jun, 2018 19:17 IST|Sakshi

న్యూయార్క్‌ : పెద్ద మొత్తంలో యుద్ద విమానాల కొనుగోలుకై భారత్‌ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. యుద్ద విమానాల కొనుగోలుకు సంబంధించి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డీల్‌ కావడంతో.. దీనిని దక్కించుకోవడానికి అనేక సంస్థలు పోటీపడుతున్నాయి. కాగా ఈ ప్రాజెక్టును తామే సొంతం చేసుకుంటామని ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్‌ సీనియర్‌ అధికారి ఒకరు ధీమా వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ఖరారైతే వచ్చే రెండేళ్లలోనే తాము భారత్‌కు కావాల్సిన యుద్ద విమానాలను అందిస్తామని పేర్కొన్నారు. 

బోయింగ్‌ డిఫెన్స్‌ సెల్స్‌ ఉపాధ్యక్షుడు జీన్‌ కన్నింగ్‌హమ్‌ కూడా భారత వైమానిక దళానికి 110 ఫైటర్‌ జెట్స్‌ అందించేందుకు జరుగుతున్న టెండర్‌ ప్రక్రియలో తాము ముందు వరుసలో ఉన్నట్టు పేర్కొన్నారు. సింగపూర్‌లో జరిగిన ఓ సదస్సులో మాట్లాడిన ఆయన.. తమకు భారత మార్కెట్‌పై పూర్తి అవగాహన ఉందన్నారు. ఇప్పటికే భారత నావికా దళానికి 57 ఫైటర్‌ జెట్స్‌ను సరఫరా చేసేందుకు నిర్వహించిన ప్రక్రియలో తమ సంస్థ తుది జాబితాలో చోటు దక్కించుకుందని తెలిపారు.

భారత్‌  ప్రతిపాదించిన 110 యుద్ధ విమానాల తయారీ అంచనా వ్యయం 15 బిలియన్‌ డాలర్లు. ఎఫ్‌/ఏ-18 సూపర్‌ హార్నెట్‌ ఫైటర్ల తయారీకి దేశీయ సంస్థలైన హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌, మహీంద్ర డిఫెన్స్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌తో కలసి పనిచేస్తామని గత ఏప్రిల్‌లోనే బోయింగ్‌ తెలిపింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును దక్కించుకునేందుకు బోయింగ్‌, స్వీడన్‌కు చెందిన సాబ్‌తోపాటు ఇతర సంస్థలు కూడా పోటీ పడుతున్నాయి.
 

మరిన్ని వార్తలు