ఆకలి సూచీలో ఆఖరునే..

16 Oct, 2019 10:18 IST|Sakshi

న్యూఢిల్లీ : అభివృద్ధిలో మున్ముందుకు సాగుతున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌ ఇంకా నేలచూపులు చూస్తూనే ఉంది. గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో 117 దేశాలకు గాను భారత్‌ 102వ స్ధానంలో చిట్టచివరి దేశాల సరసన చేరింది. ఆకలి కేకలతో అలమటిస్తున్న 45 దేశాల్లో భారత్‌ ఒకటని ఈ నివేదిక తేల్చింది. ఈ సూచీలో భారత్‌ ర్యాంకింగ్‌ క్రమంగా దిగజారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజా ర్యాంకింగ్‌తో దక్షిణాసియాలో పాకిస్తాన్‌ (94), బంగ్లాదేశ్‌ (88), శ్రీలంక (66)ల కన్నా భారత్‌ వెనుకబడింది. 2014లో హంగర్‌ ఇండెక్స్‌లో 77 దేశాల్లో భారత్‌ 55వ స్దానంలో నిలిచింది. చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో భారత్‌తో పోలిస్తే దక్షిణాసియాలో నేపాల్‌, బంగ్లాదేశ్‌లు మెరుగ్గా ఉన్నాయని వెల్లడైంది.

క్షుద్బాధను సమర‍్ధంగా తిప్పికొట్టేందుకు అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ స్ధాయిలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్న తీరుతెన్నులను పర్యవేక్షించేందుకు ఈ సూచీని రూపొందిస్తారు. ఆకలి సమస్య తీవ్రంగా పట్టిపీడిస్తున్న 45 దేశాల్లో భారత్‌ ఒకటని వెల్త్‌హంగర్‌లైఫ్‌ అండ్‌ కన్సన్‌ వర్డ్ల్‌వైడ్‌ సంస్థ నివేదిక వెల్లడించింది. భారత్‌లో ఆరు నుంచి 23 నెలల చిన్నారుల్లో కేవలం 9.6 శాతం మందికే సరైన మోతాదులో ఆహారం అందుతోందని పేర్కొంది. 2015-16లో 90 శాతం గృహాలకు మెరుగైన తాగు నీరు లభించినా, 39 శాతం మంది గృహస్తులకు పారిశుద్ధ్య సదుపాయాలు లేవని నివేదిక వెల్లడించింది. మరోవైపు భారత్‌లో ఇంకా బహిరంగ మల విసర్జన ఇప్పటికీ కొనసాగుతోందని పేర్కొంది.

మరిన్ని వార్తలు