ఫైనల్‌కు 13 భారీ స్క్రీన్స్‌

18 Nov, 2023 05:11 IST|Sakshi

13 జిల్లా కేంద్రాల్లో 2 లక్షల మంది చూసేలా స్క్రీన్స్‌ ఏర్పాటు

అనుమతులిచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు

విశాఖలో రూ.300 కోట్లతో మరో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం

రూ.100 కోట్ల విలువైన స్థలాన్ని కేటాయించేందుకు సీఎం నిర్ణయం

‘సాక్షి’తో ఏసీఏ కార్యదర్శి గోపీనాథ్‌ రెడ్డి

సాక్షి ప్రతినిధి, విశాఖ­పట్నం: భారత్‌ – ఆస్ట్రేలియా మధ్య ఆది­వారం జరిగే ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను ప్రజలు ఒకే చోట వీక్షించేలా రాష్ట్రంలో 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) కార్యదర్శి ఎస్‌.గోపీనాథ్‌­రెడ్డి తెలిపారు. 2 లక్షల మంది మ్యాచ్‌ చూసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ ప్రవేశం పూర్తిగా ఉచితమని చెప్పారు.

ఇందుకయ్యే ఖర్చు మొత్తం అసోసియేషన్‌ భరిస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సహకారంతో ఏసీఏ అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌), స్టేడియాల్లో సదుపాయాలు, క్రీడాకారులకు పౌష్టికాహారం, విశాఖలో నూతన స్టేడియం నిర్మాణం, స్కూల్‌ విద్యార్థులకు లీగ్‌ టోర్నమెంట్స్‌.. ఇలా ఏసీఏ ప్రణాళికలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. 

దేశంలోనే తొలిసారిగా
దేశంలోనే తొలిసారిగా సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ కోసం విశాఖ, కడప, విజయవాడలో ఏర్పాటు చేసిన బిగ్‌ స్క్రీన్లకు మంచి స్పందన వచ్చింది. ఈ ఉత్సాహంతో ఫైనల్‌ మ్యాచ్‌ కోసం ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటుకు నిర్ణయించాం. ఈ నిర్ణయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ అభినందించారు. ఇందుకు ధన్యవాదాలు. ప్రతి చోటా కనీసం 10 వేల మంది కూర్చొనేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆర్‌జే, డీజే, ప్రత్యేక లైటింగ్, అధునాతన సౌండ్‌ సిస్టమ్స్, ఫుడ్‌ కోర్టులూ ఏర్పాటు చేస్తున్నాం.

విశాఖలో రూ. 300 కోట్లతో కొత్త స్టేడియం
విశాఖలో బీసీసీఐతో కలిసి రూ.300 కోట్లతో నూతన స్టేడియం నిర్మాణం విషయాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకువెళ్లాం. ఆయన వెంటనే స్థలాన్ని కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు. తక్కువ సమయంలోనే రూ.100 కోట్లు విలువ చేసే స్థలాన్ని కేటాయిస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే నెల రోజుల్లోనే స్టేడియంకు శంకుస్థాపన చేస్తాం. ఈ స్టేడియం సామర్థ్యం 50 వేల పైనే ఉంటుంది.

రాష్ట్రంలో క్రికెట్‌ మౌలిక సదుపాయాలు, ఆటగాళ్ల సంక్షేమం, శిక్షణపై ఏసీఏ ప్రత్యేక దృష్టి సారించింది. నెల్లూరులో, పశ్చిమ గోదావరిలో స్టేడియంల నిర్మాణం జరుగుతోంది. పులివెందుల స్టేడియం పనులు తుది దశలో ఉన్నాయి. అన్నింట్లోనూ మెషినరీ, నెట్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నాం. కోచ్‌లను శిక్షణ కోసం ఎన్‌సీఏకు పంపిస్తున్నాం. ఏపీఎల్‌ను విజయవంతంగా నిర్వహించడంతో ఏసీఏకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. సీఎం వైఎస్‌ జగన్‌ సహకారంతోనే రెండు సీజన్లు విశాఖలో నిర్వహించాం. పదేళ్లుగా ప్రీమియర్‌ లీగ్స్‌ నిర్వహిస్తున్న తమిళనాడు, కర్ణాటక కంటే ఆంధ్రాకే మంచి ర్యాంకింగ్‌ వచ్చింది.

త్వరలో స్కూల్‌ లీగ్స్‌
ఏసీఏ అధ్యక్షుడు శరత్‌చంద్రారెడ్డి నాయక­త్వంలో ఆంధ్రా క్రికెట్‌లో మార్పులకు ప్రణా­ళి­కలు సిద్ధం చేశాం. వీటిలో ముఖ్యమై­నది పాఠశాలల స్థాయిలో లీగ్స్‌. 12 నుంచి 16 ఏళ్లలోపు వారికి ప్రతి నియోజకవర్గం పరిధిలో టోర్నమెంట్స్‌ నిర్వహిస్తాం. వీటి­లో ప్రతిభ చూపిన వారిని సబ్‌సెంటర్లకు, అక్కడి నుంచి జిల్లా, రాష్ట్రస్థాయికి.. ఇలా ఉన్నత స్థాయికి వెళ్లేలా శిక్షణ ఇస్తాం. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ పెంచేందుకు జోనల్‌ నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి క్రికెటర్‌కు నెలకు రూ.3 వేలు పౌష్టికాహారం కోసం అంద­జేస్తు­న్నాం. ఇందుకు సుమారు రూ.కోటి వరకు ఖర్చవుతోంది.

దేశంలో మరే అసో­సియేషన్‌ ఇవ్వని విధంగా రిటైర్డ్‌ రంజీ ఆటగాళ్లకు నెలకు రూ.10 వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నాం. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను శిక్షణ కోసం విదేశాలకు పంపాలని ఏసీఏ నిర్ణయించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకస్తుందని ప్రకటించింది. దీనిపై ఆస్ట్రేలి­యా, ఇంగ్లండ్‌లో శిక్షణ ఇచ్చే వారితో సంప్రదింపులు కూడా జరిగాయి. సీజన్‌ పూర్తయిన వెంటనే ఆటగాళ్లను పంపిస్తాం.

మరిన్ని వార్తలు