భారత్‌ @ 39

9 Mar, 2020 04:39 IST|Sakshi

కేరళలో మరో 5 కోవిడ్‌ కేసులు

అమెరికా అధ్యక్షుడి భేటీకి హాజరైన వ్యక్తికి సోకిన వైరస్‌

చైనాలో కోవిడ్‌ ఆస్పత్రి భవనం కూలి 10 మంది మృత్యువాత

న్యూఢిల్లీ/తిరువనంతపురం/వాషింగ్టన్‌/బీజింగ్‌: దేశంలో కోవిడ్‌ బాధితుల సంఖ్య అనూహ్యంగా 39కు చేరుకుంది. కేరళకు చెందిన ఓ కుటుంబం ఇటీవల ఇటలీ నుంచి వచ్చింది. వీరు ఎయిర్‌పోర్టులో అధికారులకు తప్పుడు సమాచారం అందించి, స్క్రీనింగ్‌ టెస్ట్‌ను తప్పించుకున్నారు. అప్పటికే వ్యాధి సోకిన వీరి ద్వారా మరో ఇద్దరికి కరోనా వైరస్‌ వ్యాపించడంతో కేరళలో బాధితుల సంఖ్య 5 అయింది. దీంతో దేశవ్యాప్తంగా కోవిడ్‌ బాధితుల సంఖ్య (16 మంది ఇటాలియన్లతో కలుపుకుని) 39 అయింది.  దేశవ్యాప్తంగా  ఉన్న ఎయిమ్స్‌లతోపాటు, ఝజ్జర్‌లోని నేషనల్‌ కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్, పుదుచ్చేరిలోని జిప్మెర్‌లో ఐసోలేషన్‌ బెడ్లను ప్రభుత్వం పెంచనుంది. రక్త పరీక్షల కోసం 52 లేబొరేటరీలను ఏర్పాటు చేసినట్లు కేంద్రం తెలిపింది.

కేరళ ప్రభుత్వం అప్రమత్తం
తాజా పరిస్థితులపై కేరళ ఆరోగ్యమంత్రి శైలజ మీడియాతో మాట్లాడారు. పత్తనంతిట్ట జిల్లాకు చెందిన దంపతులు, తమ కుమారుడితో ఇటీవల ఇటలీ వెళ్లారు.  వారు దోహా మీదుగా  ఇటీవల కోచి చేరుకున్నారు. విమానాశ్రయంలో అధికారులకు తప్పుడు సమాచారమిచ్చి, స్క్రీనింగ్‌ పరీక్షల నుంచి తప్పించుకున్నారు. అప్పటికే వైరస్‌ బారిన పడిన వీరి ద్వారా కుటుంబసభ్యులిద్దరికి వ్యాధి సోకింది. సహకరించకపోవడంతో బలవంతంగానే వీరిని ఆస్పత్రులకు తరలించాం. వీరి పరిస్థితి నిలకడగా ఉంది’ అని మంత్రి తెలిపారు. ఇలా ఉండగా, మస్కట్‌ నుంచి తమిళనాడుకు చేరుకున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు కోవిడ్‌ సోకినట్లు పరీక్షల్లో తేలింది. అమెరికా నుంచి చెన్నై వచ్చిన 15 ఏళ్ల బాలుడిలోనూ వైరస్‌ లక్షణాలున్నట్లు అనుమానిస్తున్నారు.

లాటిన్‌ అమెరికాలో మొదటి మరణం
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ బాధిత 95 దేశాలకు చెందిన 3,595 మంది చనిపోగా బాధితుల సంఖ్య 105,836కు చేరుకుంది. చైనా (3,097 మరణాలు, 80,695 కేసులు) ఆ తర్వాత దక్షిణ కొరియా(48 మరణాలు, 7,134 కేసులు), ఇరాన్‌(194 మర ణాలు, 6,566 కేసులు), ఫ్రాన్సు (16 మృతులు, 949 కేసులు) ఉన్నాయి. అమెరికాలో  కోవిడ్‌తో 17 మంది చనిపోగా 420 కేసులు బయటపడ్డాయి. అర్జెంటీనాలో మొదటి మరణం సంభవిం చింది. బల్గేరియా, పరాగ్వే తదితర దేశాల్లో నూ కోవిడ్‌ బాధితులను గుర్తించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ గత నెలలో   నిర్వహించిన సమావేశాల్లో పాల్గొన్న ఓ వ్యక్తికి కోవిడ్‌ సోకినట్లు పరీక్షల్లో తేలింది.  

ఇటలీ అష్టదిగ్బంధనం
ఇటలీలో ఒక్కరోజే 133 మంది మరణించటంతో మృతుల సంఖ్య 366కు చేరుకుంది. అదేవిధంగా మొత్తం కేసులు 5,883 అయ్యాయి. దీంతో ఇటలీ ప్రభుత్వం తీవ్ర చర్యలు చేపట్టింది. ఉత్తర ఇటలీ ప్రాంతంలోకి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు రాకపోకలను నిషేధించింది. దీంతో  దాదాపు 1.50 కోట్ల మందిని దిగ్బంధనంలో ఉంచినట్లయింది. సినిమా హాళ్లు, థియేటర్లు, మ్యూజియంలను మూసివేసింది. పోప్‌ ఫ్రాన్సిస్‌ సెయింట్‌ పీటర్స్‌ బసిలికా చర్చి కిటికీ నుంచి చేసే ఎంజెలస్‌ ప్రేయర్‌ను వాటికన్‌ సిటీ ఆదివారం లైవ్‌లో ప్రసారం చేసింది.

కూలిన ‘కోవిడ్‌’ భవనం
చైనాలో కోవిడ్‌ అనుమానితులను ఉంచిన ఆస్పత్రి శనివారం కూలడంతో 10 మంది చనిపోయారు. ఫుజియాన్‌ ప్రావిన్సు క్వాంగ్‌ఝౌ నగరంలోని ఓ హోటల్‌ను ప్రభుత్వం ఆస్పత్రిగా మార్చివేసి అందులో కోవిడ్‌ అనుమానితులను క్వారంటైన్‌లో ఉంచారు. 80 గదులున్న ఈ భవనం శనివారం అకస్మాత్తు గా కూలిపోవడంతో 10 మంది చనిపోయారు. సహాయక సిబ్బంది 50 మందిని రక్షించారు. కొందరు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు.  (చదవండి: కోవిడ్‌ కేసులు లక్ష పైనే)

>
మరిన్ని వార్తలు