ప్రతి ఉగ్రచర్యకు మూలాలు పాక్‌లోనే..

14 Dec, 2019 09:04 IST|Sakshi

ఐరాసలో పాక్‌పై భారత్‌ ధ్వజం  

ఐక్యరాజ్యసమితి: ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగిన దాని మూలాలు పాకిస్తాన్‌లోనే ఉంటున్నాయంటూ పాక్‌పై భారత్‌ మండిపడింది. పాక్‌లోనే ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నారని.. వారే అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి సర్వ సభ్య సమావేశంలో గురువారం ‘కల్చర్‌ ఆఫ్‌ పీస్‌’ అనే అంశంపై చర్చాగోష్టి జరిగింది. ఇందులో జమ్మూ కశ్మీర్‌ అంశం, పౌరసత్వ సవరణ బిల్లును పాక్‌ ప్రస్తావించింది. దీనిపై ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధి పౌలోమి త్రిపాఠి మండిపడ్డారు. ఈ సమావేశం ఎజెండాను తప్పుదోవ పట్టించొద్దని.. రాజకీయాలు చేయొద్దని పాక్‌కు హితవు పలికారు.

జమ్మూ కశ్మీర్‌ అంశం, పౌరసత్వ సవరణ బిల్లు, అయోధ్య తీర్పు.. ఇవన్నీ భారత అంతర్గత వ్యవహారాలని ఐరాసలో పాక్‌ ప్రతినిధి మునీర్‌ అక్రమ్‌కు బదులిచ్చారు. రాజకీయ స్వలాభం కోసం అర్థ రహిత ఆరోపణలతో సహకార స్ఫూర్తిని దెబ్బ తీస్తున్నారని త్రిపాఠి ఆక్షేపించారు. ‘ఉగ్రవాదులకు పాక్‌ స్వర్గధామం. అక్కడ పిల్లలకు పుస్తకాలకు బదులు తుపాకులు ఇస్తారు. మహిళలను అణిచివేతకు గురిచేస్తారు. మైనారిటీ మహిళలను హింసిస్తారు. ఈ సమస్యలను కప్పిపుచ్చుకునేందుకు ఇతర దేశాలపై పాకిస్తాన్‌ నిరాధార ఆరోపణలు గుప్పిస్తోంది..’అని త్రిపాఠి ధ్వజమెత్తారు.  
 

>
మరిన్ని వార్తలు