వార్‌ రూమ్‌లో కిమ్‌: 17 నిమిషాల్లో గ్వామ్‌ ముక్కలు!

15 Aug, 2017 16:13 IST|Sakshi
వార్‌ రూమ్‌లో కిమ్‌: 17 నిమిషాల్లో గ్వామ్‌ ముక్కలు!

ప్యాంగ్‌యాంగ్‌: గ్వామ్‌ ద్వీపాన్ని నామరూపాలు లేకుండా చేసేందుకు ఉత్తరకొరియా నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ పక్కా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అమెరికా-ఉత్తరకొరియాల మధ్య మాటల తూటాలు పేలిన తర్వాత పసిఫిక్‌ సముద్ర జలాల్లో ఉన్న అమెరికాకు చెందిన గ్వామ్‌ ద్వీపంపై అణు దాడి చేస్తామని, అందుకు తగిన ప్రణాళికను కూడా సిద్ధం చేశామని కిమ్‌ రాజ్యం ప్రకటించిన విషయం తెలిసిందే.

గ్వామ్‌పై దాడికి కిమ్‌ నేతృత్వంలోని కీలక అధికారులు సమావేశమైన 'వార్‌ రూమ్‌' చిత్రాలను ఆ దేశ మీడియా బయటకు విడుదల చేసింది. ఓ చిత్రంలో గ్వామ్‌ ద్వీపానికి సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను కిమ్‌ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన వెనుక భాగంలో కొరియా, జపాన్‌ దేశాల సముద్రజలాల్లో ఉన్న అమెరికా బేస్‌లకు సంబంధించిన చిత్రాలు ఉన్నాయి.

కిమ్‌కు సహకరిస్తున్న వారిలో ఉత్తరకొరియా రాకెట్‌ పితామహుడు కిమ్‌ జాంగ్‌ సిక్‌ కూడా ఉన్నారు. ఉత్తరకొరియా అణు శక్తి కలిగిన క్షిపణులను తయారు చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఉత్తరకొరియాకు తూర్పున ఉన్న ఓ నావల్‌ బేస్‌ నుంచి జపాన్‌ మీదుగా గ్వామ్‌పై దాడి చేసేందుకు కిమ్‌ వ్యూహం రచించారని దక్షిణ కొరియాకు చెందిన మిలటరీ నిపుణుడు ఒకరు తెలిపారు.

నాలుగు మధ్యతరహా శ్రేణి క్షిపణులను ఉత్తరకొరియా గ్వామ్‌ మీద ప్రయోగిస్తుందని చెప్పారు. ఇవి 17 నిమిషాలు పాటు 3,356 కిలోమీటర్లు ప్రయాణించి గ్వామ్‌ ద్వీపానికి 40 కిలోమీటర్ల దూరంలో సముద్ర జలాలను ఢీ కొంటాయని వివరించారు. అయితే, అమెరికా సోమవారం ఉత్తరకొరియా విషయంలో ఆచితూచి వ్యవహరించినట్లు కనిపించింది. దీంతో మరికొన్ని రోజుల పాటు గ్వామ్‌పై దాడి చేయాలనే ఆలోచనను ఉత్తరకొరియా పక్కనబెట్టినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు