ఆ ముసుగు ధరిస్తే మాయం అవడం ఖాయం!

9 Dec, 2017 18:09 IST|Sakshi

బీజింగ్‌: మాయా ముసుగును ధరిస్తే మనుషులు కూడా కనిపించకుండా మాయం అయ్యే దృశ్యాలను నాటి పౌరాణిక చిత్రాల నుంచి నేటి సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రాల వరకు చూస్తూనే  ఉన్నాం. ఏ వస్తువునైనా కనిపించకుండా మాయం చేసే గడియారాన్ని (క్లాక్‌) కనిపెట్టవచ్చంటూ కొంతమంది శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో పరిశోధనలు, ప్రయోగాలు చేశారు. ఎవరూ కూడా ఈ విషయంలో పూర్తి విజయాన్ని సాధించిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు.  అయితే చైనా ప్రజా భద్రత మంత్రిత్వ శాఖలో నేర దర్యాప్తు విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న చెన్‌ షికు అలాంటి ఓ మాయా ముసుగును ప్రదర్శించారు.
అత్యంత పారదర్శకంగా ఉన్న ఓ టేబుల్‌ క్లాత్‌ లాంటి గుడ్డను ఆయన తన విభాగంలోని పార్క్‌లో ప్రదర్శించారు. ఆ క్లాత్‌ను తనముందు ఏ మేరకు పట్టుకుంటే ఆ మేరకు ఆయన  నిజంగా కనిపించకుండా పోతున్నారు. వెనుతిరిగి, ముందుకు తిరిగి ఆయన ఈ మాయను అద్భుతంగా ప్రదర్శించి చూపారు. క్వాంటమ్‌ థియరీని ఉపయోగించి ఈ పారదర్శక క్లాత్‌ను తయారు చేశామని, అందుకనే దీన్ని ‘క్వాంటమ్‌ ఆఫ్‌ ఇన్విజుబిలిటీ క్లాక్‌’ అని పిలుస్తున్నామని చెప్పారు. మనిషి మీద పడి పరావర్తనం చెందే కాంతి మనిషి చుట్టూ తిరిగి బయటకు పోవడం వల్ల మనిషి కనిపించకుండా పోతారని ఆయన వివరించారు.  దొంగలను పట్టుకునే పోలీసులకు, టెర్రరిస్టులను పట్టుకునే భద్రతా దళాలకు ఈ క్లాత్‌లను డ్రెస్‌లుగా కుట్టిస్తే ఎంతో ఉపయోగమని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

అదే దొంగలకు, టెర్రరిస్టులకు కూడా ఈ క్లాత్‌ దొరికితే ఎలా ఉంటుందన్న విషయాన్ని మాత్రం ఆయన ఆలోచించలేకపోయారు. ఈ క్లాత్‌ ప్రదర్శనకు సంబంధించిన వీడియోను ఆయన డిసెంబర్‌ 4వ తేదీన చైనా సోషల్‌ మీడియా ‘వైబో’ సైట్‌లో విడుదల చేయడంతో ఇప్పటి వరకు 2.11 కోట్ల మంది వీక్షించారు. చూసిన వారంతా అబ్బురపడ్డారు. అయితే ఇలాంటి ‘ఇన్విజబుల్‌ క్లాక్‌’ అనేది ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా లేదని ‘క్వాంటమ్‌ వీడియో ప్రొడక్షన్‌ కంపెనీ’కి చెందిన ప్రొడ్యూసర్‌ జూ జెన్‌సాంగ్‌ తెలిపారు. నీలి లేదా ఆకుపచ్చ ప్లాస్టిక్‌ క్లాత్‌ను ఉపయోగించి వీడియో తీసి దాన్ని అతి జాగ్రత్తగా ఎడిట్‌ చేశారని చెప్పారు. అడోబ్స్‌కు చెందిన ‘ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌’, ‘బ్లాక్‌మేజిక్‌ ఫ్యూజన్‌’ లాంటి ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించి దృశ్యాల బ్యాక్‌గ్రౌండ్‌ను సులభంగానే ఎడిట్‌ చేయవచ్చని ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు