అమెరికా డ్రోన్‌ను కూల్చిన ఇరాన్‌

21 Jun, 2019 04:25 IST|Sakshi
ఇరాన్‌ కూల్చింది ఈ రకం డ్రోన్‌నే

యుద్ధానికి ఎప్పుడైనా సిద్ధమేనని హెచ్చరిక

పెద్ద తప్పు చేశారు: ట్రంప్‌

పెరిగిన క్రూడ్‌ ధర

టెహ్రాన్‌: అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తమ భూభాగంలోకి చొచ్చుకువచ్చిన అమెరికాకు చెందిన ఒక నిఘా డ్రోన్‌ను కూల్చివేసినట్టు ఇరాన్‌ వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఏడాది క్రితం ఇరాన్‌తో అణు ఒప్పందం వెనక్కి తీసుకున్నప్పట్నుంచి ఇరు దేశాల మ«ధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఏ క్షణమైనా రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ తమ దేశ గగనతలంలోకి ప్రవేశించిన మానవరహిత, ఆయుధరహిత ఆర్‌క్యూ 4ఏ నిఘా డ్రోన్‌ను కూల్చేసినట్టు అక్కడ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కానీ దానికి సంబంధించిన ఫొటోలను ఇరాన్‌ ప్రభుత్వం వెల్లడించలేదు. అమెరికా డ్రోన్‌ను కూల్చేసిన విషయాన్ని ధ్రువీకరిస్తూనే తాము నిబంధనలు ఉల్లంఘించి ఇరాన్‌ భూభాగంలోకి చొరబడలేదని హార్మోజ్‌గాన్‌ ప్రావిన్స్‌  వరకు ఆ డ్రోన్‌ వెళ్లిందని అది అంతర్జాతీయ గగనతలమని  అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ చెబుతోంది.

వారం కిందటే అమెరికా డ్రోన్‌పై ఇరాన్‌ క్షిపణి దాడులకు దిగిందని అమెరికా మిలటరీ ఆరోపించింది. ఇప్పుడు ఈ డ్రోన్‌ను కూల్చివేసి ఇరాన్‌ అగ్రరాజ్యానికి ఘాటైన హెచ్చరికలే చేసింది. ‘‘ఏ దేశమైనా మా ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలి. ఇరాన్‌ జాతీయ ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా చూసుకోవాలి. అమెరికా మా గగనతలంలోకి ప్రవేశిస్తే ఎందుకు ఊరుకుంటాం. అందుకే సరైన సమయంలో సరైన  నిర్ణయాన్నే తీసుకొని డ్రోన్‌ని కూల్చివేశాం‘‘ అని ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్పొరేషన్‌ జనరల్‌ హొస్సెని సలామి వెల్లడించారు. 

ఇరాన్‌కి ఎవరితోనూ యుద్ధం చేయాలన్న కోరిక లేదు కానీ, ఏ క్షణంలోనైనా యుద్ధం చెయ్యడానికి తామే సిద్ధమేనని సలామి ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌ అణు ఒప్పందాన్ని వెనక్కి తీసుకోడమే కాక ఇరాన్‌తో ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలు వద్దంటూ అగ్రరాజ్యం ఇతర దేశాలపై ఒత్తిడి పెంచినప్పట్నుంచి ఇరాన్‌ కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది. డ్రోన్‌ను కూల్చివేయడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ ఒక డ్రోన్‌ను కూల్చివేసి దానిని అందరికీ ప్రదర్శించడంతో అమెరికా అగ్గిమీద గుగ్గిలమైంది. మున్ముందు పరిస్థితులు ఏ మలుపు తిరుగుతాయోనని ప్రపంచ దేశాలు ఆందోళనతో ఉన్నాయి.

పెద్ద తప్పిదమే చేశారు: ట్రంప్‌
డ్రోన్‌ను కూల్చివేయడం ద్వారా ఇరాన్‌ పెద్ద తప్పే చేసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ గురువారం అన్నారు. శ్వేతసౌధం ప్రెస్‌ కార్యదర్శి సారా శాండర్స్‌ మాట్లాడుతూ ఈ ఘటన గురించి బుధవారం రాత్రి, గురువారం ఉదయం  ట్రంప్‌కు తాము వివరాలు వెల్లడించామని చెప్పారు. అనంతరం ట్రంప్‌ ట్వీట్‌ చేస్తూ ‘ఇరాన్‌ చాలా పెద్ద తప్పే చేసింది’ అని పేర్కొన్నారు. కాగా, ట్రంప్‌ చేసిన ఈ ట్వీట్‌ కారణంగా ముడిచమురు ధరలు దాదాపు 6 శాతం వరకు పెరిగాయి. వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌లో బ్యారెల్‌ చమురు ధర 6.3 శాతం పెరిగి 57.13 డాలర్లకు చేరగా, లండన్‌లోని బ్రెంట్‌ ఫ్యూచర్స్‌లో బ్యారెల్‌ ధర 64.69 డాలర్లకు చేరింది. 

మరిన్ని వార్తలు