ఆమెతో భేటీకి జైశంకర్‌ నిరాకరణ

21 Dec, 2019 08:42 IST|Sakshi
ప్రమీలా జయపాల్‌, జైశంకర్‌

వాషింగ్టన్‌: కశ్మీర్‌పై కాంగ్రెగేషనల్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన భారతీయ అమెరికన్‌ పార్లమెంటు సభ్యురాలు ప్రమీలా జయపాల్‌తో సమావేశమయ్యేందుకు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ నిరాకరించారు. ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన ఈ తీర్మానం జమ్మూ కశ్మీర్‌లోని వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. చర్చలు జరపాలనుకున్న వారిని కలిసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరమూ లేదని, కాకపోతే ముందుగానే అభిప్రాయాలు ఏర్పరచుకున్న వారితో మాత్రం కాదని ఆయన స్పష్టం చేశారు.

భిన్నాభిప్రాయాలు వినరా?
తనతో భేటీని జైశంకర్‌ రద్దు చేసుకోవడంపై ప్రమీలా జయపాల్‌ ట్విటర్‌లో స్పందించారు. సమాదేశం రద్దు కావడం తనను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని అన్నారు. భిన్నాభిప్రాయాలను వినడానికి భారత్‌ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా లేదన్న విషయం దీంతో రుజువైందని ట్వీట్‌ చేశారు. బీజేపీ మద్దతుదారులు ఆమెను విమర్శిస్తుండగా, కొంత మంది మేధావులు ఆమెకు అండగా నిలిచారు. సీనియర్‌ స్కాలరైన ప్రమీలా జయపాల్‌.. భారత్‌-అమెరికా సంబంధాల బలోపేతానికి కృషి చేస్తున్నారు. మత సహనమే భారత్‌ బలమని, దీన్ని కాపాడేందుకు న్యూఢిల్లీ సర్వదా ప్రయత్నించాలని గతంలో ఆమె వ్యాఖ్యానించారు.

ప్రతిభను అడ్డుకోకండి: జైశంకర్‌
భారత్‌ నుంచి వస్తున్న ప్రతిభావంతులను అడ్డుకోరాదని జైశంకర్‌ అమెరికాకు సూచించారు. ఇరు దేశాల మధ్య వారి సేవలు వ్యూహాత్మక వారధిగా పనిచేస్తాయని, ఆర్థిక సహకారంలోనూ ఇది ముఖ్యమైన భాగమని గురువారం స్పష్టం చేశారు. ఐటీ ఉద్యోగులకు హెచ్‌–1బీ వీసాలు అత్యంత కీలకమైనవి. అమెరికన్‌ కంపెనీలు ఏటా భారత్, చైనాల నుంచి కొన్ని వేల మందిని హెచ్‌–1బీ వీసాల సాయంతో ప్రత్యేక రంగాల్లో ఉద్యోగులను నియమించుకుంటోంది. ‘భారత్‌ నుంచి వెల్లువెత్తే ప్రతిభ ప్రవాహానికి ఎలాంటి అడ్డంకి ఉండరాదని, అసంబద్ధమైన చట్ట నియంత్రణలూ ఉండరాదన్న విషయాన్ని స్పష్టం చేశాను’ అని ఆయన చెప్పారు. వైట్‌హౌస్‌లోనూ ఈ అంశం చర్చకు వచ్చినట్లు తెలిపారు.
 
ట్రంప్‌తో రాజ్‌నాథ్, జైశంకర్‌లు భేటీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ భేటీ అయ్యారు. అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో ఈ భేటీ జరిగింది. ఇందులో ప్రధానంగా ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిగినట్లు సమావేశానంతరం రాజ్‌నాథ్‌ తెలిపారు. మీటింగ్‌లో ట్రంప్‌ గత సెప్టెంబర్‌లో జరిగిన హౌడీ మోదీ సభ గురించి ప్రస్తావించినట్లు చెప్పారు. వాణిజ్యం గురించి కూడా కొద్దిగా చర్చ జరిగినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్‌ తెలిపారు. భేటీపట్ల ట్రంప్‌ ఆసక్తి ప్రదర్శించినట్లు చెప్పారు. 

మరిన్ని వార్తలు