ముక్కలు చేసి యాసిడ్‌లో కరిగించి..

3 Nov, 2018 03:43 IST|Sakshi
జమాల్‌ ఖషోగ్గీ

జమాల్‌ ఖషోగ్గీ హత్య తర్వాత సౌదీ కాన్సులేట్‌లో దారుణం

అంకారా: పాత్రికేయుడు జమాల్‌ ఖషోగ్గీ హత్య అనంతరం ఆయన మృతదేహాన్ని ఇస్తాంబుల్‌లోని సౌదీ రాయబార కార్యాలయంలోనే ముక్కలుగా నరికి యాసిడ్‌లో కరిగించి ‘మాయం’చేశారని టర్కీ అధ్యక్షుడు రెసిప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌ సలహాదారు వెల్లడించారు. దీనిపై దర్యాప్తు అధికారులు విచారణ చేపడుతున్నారు. ‘ఆయన శరీర భాగాలను కేవలం ముక్కలుగా చేయలేదు. ఆనవాళ్లు లేకుండా చేసేందుకు యాసిడ్‌లో కరిగించేశారు’అని ఎర్డోగన్‌ సలహాదారు యాసిన్‌ అక్తయ్, టర్కీ అధికార పార్టీకి చెందిన ఓ నేత హరియత్‌ వార్తా పత్రికకు చెప్పారు.

యాసిడ్‌లో కరిగించడం సులువనే ఉద్దేశంతో ముక్కలుగా కోశారని అక్తయ్‌ చెప్పారు. తమపై విమర్శలు చేసినందుకు ఖషోగ్గీని హత్య చేయించిందని సౌదీ అరేబియాపై అంతర్జాతీయంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. సౌదీ కాన్సులేట్‌లోకి అక్టోబర్‌ 2న ప్రవేశించిన వెంటనే ఖషోగ్గీని గొంతు నులిమి చంపేశారని, తర్వాత ముక్కలుగా చేసి, యాసిడ్‌లో కరిగించారని టర్కీ ప్రధాన ప్రాసిక్యూటర్‌ స్పష్టం చేశారు. ఆయన శరీరానికి సంబంధించి చిన్న ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకే ఈ పని చేసి ఉంటారని చెప్పారు. సౌదీ కాన్సులేట్‌ ఆవరణలోని బావిలో వెతికేందుకు టర్కీ అధికారులను సౌదీ అధికారులు అనుమతివ్వలేదు. నీటి శాంపిల్స్‌ను తీసుకెళ్లేందుకు అనుమతించారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు