లండన్‌కు తాకిన అమెరికా నిరసనల సెగ

11 Jun, 2020 11:41 IST|Sakshi

లండన్‌: జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల ప్రభావం బ్రిటన్‌ మీద కూడా పడింది. ‘బ్లాక్‌లైవ్స్‌ మాటర్‌’‌ నిరసన సెగ దేశవ్యాప్తంగా ఉన్న బానిస వ్యాపారులు, వలసవాదుల విగ్రహాలకు తాకింది. మంగళవారం ఆందోళనకారులు లండన్‌ మ్యూజియం బయట ఉన్న 18వ శతాబ్దానికి చెందిన బానిసల వ్యాపారి రాబర్ట్‌ మిలిగాన్‌ విగ్రహాన్ని తొలగించారు. ఈ క్రమంలో లండన్‌ మేయర్‌ సాదిక్ ఖాన్ ‘మన నగరం, దేశ సంపద బానిస వ్యాపారం నుంచి ఉద్భవించిది అనేది వాస్తవం. బహిరంగ ప్రదేశాల్లో ఇందుకు సంబంధించిన వేడుకలు జరుపుకోనవసరం లేదు. ఈ విగ్రహాలు, రహదారి పేర్లు, బహిరంగ ప్రదేశాల పేర్లు పూర్వ యుగాన్ని ప్రతిబింబిస్తాయి. వీటి గురించి ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది’ అంటూ ట్వీట్‌ చేశారు.

నిరసనల నేపథ్యంలో లండన్‌ వ్యాప్తంగా వలసవాదులు, బానిస వ్యాపారుల పేర్ల మీద ఉన్న విగ్రహాలు, వీధుల పేర్లను సమీక్షించేందుకు గాను ఓ కమిటిని నియమించినట్లు సాదిక్ ఖాన్‌ తెలిపారు. ఆదివారం నిరసనకారులు బ్రిస్టల్‌లోని ఇంగ్లీష్‌ పోర్టు సిటిలో ఉన్న ఓ బానిసల వ్యాపారి కోల్‌స్టోన్‌ విగ్రహాన్ని రేవులో పడేశారు. సోమవారం ఆక్స్‌ఫర్డ్‌లో 1,000 మందికి పైగా ప్రదర్శనకారులు వలసవాది సిసిల్ రోడ్ విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో టవర్ హామ్లెట్స్ మేయర్ జాన్ బిగ్స్ రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. ‘విగ్రహాలను తొలగించడం మంచి పద్దతి కాదు. కానీ నిరసకారుల ఆందోళన వల్ల ప్రస్తుతం ఈ విగ్రహాలను తొలగించి స్టోర్‌ రూమ్‌లో భద్రపరిచి.. ఏం చేయాలనే దాని గురించి తర్వాత నిర్ణయం తీసుకుంటాం’ అన్నారు. (‘నువ్వు మమ్మల్ని కాలుస్తావా?’)

‘ప్రజలు ఇన్నాళ్లు విగ్రహాలు నిలబెట్టిన వ్యక్తులందరిని గొప్ప వ్యాపారవేత్తలుగా భావించారు. వారంతా దేశ ఉన్నతికి తోడ్పడ్డారని అనుకున్నారు. కానీ లోతుగా తరచి చూస్తే తెలిసే వాస్తవం ఏంటంటే వారంతా బానిస వ్యాపారులు. అందుకే ఎడ్వర్డ్ కోల్‌స్టోన్‌ విగ్రహాన్ని తొలగిస్తున్న నిరసనకారులను బ్రిస్టల్‌ పోలీసులు అడ్డుకోలేదు’ అన్నారు బిగ్స్‌. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మాత్రం ఎడ్వర్డ్ కోల్‌స్టోన్‌ విగ్రహాన్ని తొలగించడాన్ని నేరంగా వర్ణించారు.

మరిన్ని వార్తలు