జోక్‌ చేశాడు.. మంత్రి పదవి ఊడింది!

10 Mar, 2017 09:54 IST|Sakshi
జోక్‌ చేశాడు.. మంత్రి పదవి ఊడింది!

టోక్యో: వరద ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్లిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఫోటో ఒకటి వివాదాస్పదం అయిన విషయం గుర్తుంది కదూ. మోకాళ్లలోతు కూడా లేని నీళ్లలో నడిచేందుకు ఆయన ఇష్టపడకపోవడంతో.. భద్రత సిబ్బంది చేతులపై ఎత్తుకెళ్లారు. ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో శివరాజ్పై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి.

గతేడాది జపాన్‌లో వరద ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్లిన ఓ మంత్రి సైతం ఇలాగే ఓ వ్యక్తిపై కూర్చుని బురద దాటాడు. ఆ ఫోటో కూడా వివాదాస్పదం అయింది. అయితే జపాన్‌ మంత్రి ఆ వివాదంలో తాజాగా రాజీనామా చేశారు. గతేడాది వివాదానికి ఇప్పుడు రాజీనామా దేనికి అనుకుంటున్నారా. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సదరు మంత్రి ఆనాటి ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే.

లియోనార్క్ టైఫూన్‌ జపాన్‌ను అతలాకుతలం చేసిన సమయంలో సహాయమంత్రి షున్‌సుకే ముతాయ్‌.. ఇవాతె ప్రావిన్స్‌లో పర్యటించారు. అక్కడ టైఫూన్‌ దాటికి 19 మంది మృతి చెందినా.. ముతాయ్‌ ఓ వ్యక్తిపై కూర్చొని చిన్న బురద ప్రాంతాన్ని దాటడమే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. అయితే.. తాను రెయిన్‌ బూట్స్‌ వేసుకోకపోవడం వల్లే అలా చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నాడు ముతాయ్‌. అంతటితో ఆ వివాదం సమసిపోయింది.

కాగా.. అధికార లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన ముతాయ్‌ ఇటీవల టోక్యోలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆనాడు తాను అలా చేయడం మూలంగా బూట్ల పరిశ్రమకు లాభం చేకూరిందని, అధికారుల కోసం ప్రభుత్వం అప్పుచేసి మరీ రెయిన్‌ బూట్లను కొనుగోలు చేసిందని జోక్‌ చేశాడు. ముతాయ్‌ జోక్‌పై ప్రతిపక్షాలతో పాటు సొంతపక్షంలోనూ తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్ మినిస్టర్‌ జున్‌ మట్సుమటో సైతం ముతాయ్‌పై తీవ్రంగా మండిపడ్డారు. దీంతో ముతాయ్‌ తన పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు