పోలీస్‌ విభాగం రద్దుకు ఓటు

9 Jun, 2020 05:24 IST|Sakshi
కాలిఫోర్నియాలో తాత్కాలిక సంస్మరణ వేదిక వద్ద నివాళులర్పిస్తున్న జనం

మినియాపోలిస్‌ సిటీ కౌన్సిల్‌ తీర్మానం

ఫ్లాయిడ్‌ అంత్యక్రియలు నేడు

హ్యూస్టన్‌/వాషింగ్టన్‌: ఆఫ్రో అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మరణించిన నేపథ్యంలో అమెరికా వ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలిప్పుడు శాంతియుత ప్రదర్శనలుగా మారిపోయాయి. పోలీసు సంస్కరణలే ప్రధాన డిమాండ్‌గా ఈ ప్రదర్శనలు జరుగుతూండటంతో పోలీసులు కూడా దుడుకు చర్యలకు పాల్పడకుండా సంయమనం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్లాయిడ్‌తో పోలీసు అధికారి వ్యవహరించిన తీరును నిరసిస్తూ మినియాపోలిస్‌ సిటీకౌన్సిల్‌ సభ్యులు పోలీస్‌ విభాగం మొత్తాన్ని రద్దు చేయాలని తీర్మానించారు.

దీని స్థానంలో సరికొత్త పోలీస్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, ప్రజలను సురక్షితంగా ఉంచేలా పనిచేసే కొత్త మోడల్‌ను ప్రవేశపెడతామని సిటీ కౌన్సిల్‌ అధ్యక్షుడు లిసా బెండర్‌ తెలిపారు. ప్రస్తుత వ్యవస్థ సమాజానికి ఏమాత్రం రక్షణ కల్పించడం లేదన్నారు. పోలీస్‌ విభాగం రద్దుకు సిటీ కౌన్సిల్‌ సభ్యులు అత్యధికం మద్దతిస్తున్నారని కౌన్సిలర్‌ అలోండ్రా కానో తెలిపారు. గత నెల 25న మినియాపోలిస్‌ పోలీస్‌ అధికారి డెరెక్‌ చావెన్‌ దాష్టీకం కారణంగా ఫ్లాయిడ్‌ మరణించిన విషయం తెలిసిందే

చర్చిలో ప్రజల సందర్శనార్థం
జార్జ్‌ ఫ్లాయిడ్‌ అంత్యక్రియలకు రంగం సిద్ధమైంది. హ్యూస్టన్‌లో తల్లి సమాధి పక్కనే ఫ్లాయిడ్‌ మృతదేహాన్ని మంగళవారం ఖననం చేయనున్నట్లు కుటుంబం తరఫు మీడియా ప్రతినిధి ఒకరు ప్రకటించారు. హిల్‌క్రాఫ్ట్‌ అవెన్యూలోని ‘ద ఫౌంటేన్‌ ఆఫ్‌ ప్రెయిస్‌’చర్చిలో ఫ్లాయిడ్‌ మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారని, ఆ తరువాత అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలిసింది.   అమెరికా అధ్యక్ష పదవికి డెమొక్రాట్ల తరఫున పోటీ చేస్తున్న జో బైడెన్‌ ఫ్లాయిడ్‌ కుటుంబాన్ని కలుస్తారని ఆయన సహాయకుడొకరు తెలిపారు.  సియాటెల్‌లో  జరిగిన నిరసన ప్రదర్శనలో  ఆందోళనకారులు సీసాలు, రాళ్లతో దాడులకు దిగారు. ఆదివారం రాత్రి ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరుపుతూ తన వాహనాన్ని ఆందోళనకారులపైకి నడిపించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో ఒకరికి బుల్లెట్‌ గాయాలయ్యాయి. ఇలా ఉండగా ఫ్లాయిడ్‌ మరణానికి కారణమైన  అధికారి డెరెక్‌ ఛావెన్‌ సోమవారం కోర్టు ముందు హాజరు కానున్నాడు.
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా