ఒబామా విందు ఇచ్చినప్పటికీ...

30 Sep, 2014 19:48 IST|Sakshi
బరాక్ ఒబామా-నరేంద్ర మోదీ

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా  వైట్‌హౌస్‌లో విందు ఇచ్చినప్పటికీ    భారత ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం తన ఉపవాస దీక్షను కొనసాగించారు. ఉపవాసం కారణంగా మోదీ నిమ్మరసం, పండ్లతో చేసిన సూప్‌లు మాత్రమే తీసుకున్నారు. విందుకు ఆహ్వానించిన ఒబామా 'కేం చో' అంటూ మోదీని గుజరాతీ భాషలో పలకరించారు. ఈ విందుకు విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్, అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్, విదేశాంగమంత్రి జాన్ కెర్రీ సహా 20 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా  మోదీ మహాత్మా గాంధీ వ్యాఖ్యానంతో కూడిన గీత, అమెరికా పౌరహక్కుల నేత మార్టిన్ లూథర్ పుస్తకాలను ఒబామాకు బహూకరించారు. విందు సందర్భంగా  ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.

విందు భేటీ అనంతరం  ప్రధాని మోదీ, ప్రెసిడెంట్ బరాక్ ఒబామా అమెరికాలోని ఒక ప్రముఖ పత్రికకు ఉమ్మడిగా సంపాదకీయం రాశారు. ఈ   సంపాదకీయం రేపు ప్రచురితమవుతుందని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అక్బరుద్దీన్ చెప్పారు.

అంతకు ముందు వాషింగ్టన్‌లోని ఇండియన్ ఎంబసీ ఎదురుగా మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జాతిపితకు మోదీ ఘనంగా పుష్పాంజలి ఘటించారు. ఇండియన్ అమెరికన్లు  పెద్దసంఖ్యలో మోదీకి స్వాగతం పలికారు.

ఇదిలా ఉండగా,  ద్వైపాక్షిక అంశాలపై ఒబామా, మోదీ మధ్య శిఖరాగ్ర చర్చలు రేపు జరుగుతాయి.
**

మరిన్ని వార్తలు