సరిహద్దుల్లో స్నేహగీతం..

29 Apr, 2018 02:44 IST|Sakshi

భారత్‌–చైనా నిర్ణయం

రెండో రోజు జిన్‌పింగ్, మోదీ భేటీ

సమాచార మార్పిడి పటిష్టం కోసం ఇరు దేశాల సైన్యాలకు మార్గనిర్దేశం

వుహాన్‌: సరిహద్దు అంశాల్లో నమ్మకం, అవగాహన నెలకొల్పే లక్ష్యంతో పరస్పరం సమాచార మార్పిడిని పటిష్టం చేసేందుకు ఇరు దేశాల సైన్యాలకు వ్యూహాత్మక మార్గనిర్దేశనం చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు నిర్ణయించారు. భవిష్యత్తులో డోక్లాం తరహా సంఘటనలు ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టేందుకు ఇరువురు నేతలు అవగాహనకు వచ్చారు. మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య వుహాన్‌లో జరుగుతున్న అనధికారిక సదస్సు చివరిరోజైన శనివారం సరిహద్దుల్లో ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు చేపట్టాల్సిన అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.

ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం భారత్‌–చైనా సరిహద్దులకు సంబంధించిన అన్ని అంశాల్లో శాంతి, స్థిరత్వం కొనసాగాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. జిన్‌పింగ్‌తో చర్చల సందర్భంగా విభిన్న రంగాల్లో భారత్‌–చైనా సహకారంపై దృష్టిసారించామని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఊతమిచ్చే మార్గాలు, ప్రజల మధ్య సంబంధాల్ని పెంపొందించే అంశాలపై మేం చర్చించాం. వ్యవసాయం, సాంకేతికత, ఇంధనం, పర్యాటక రంగాలపైనా మాట్లాడాం.

మా ఇద్దరి మధ్య చర్చలు ఫలప్రదంగా సాగాయి. భారత్, చైనాల మధ్య దృఢమైన స్నేహం రెండు దేశాల ప్రజలకే కాకుండా, మొత్తం ప్రపంచానికే లాభదాయకం’ అని  ట్వీట్‌ చేశారు. మోదీ, జిన్‌పింగ్‌లు చర్చలు, ఇతర కార్యక్రమాల్లో భాగంగా దాదాపు 9 గంటల పాటు కలిసి గడిపారని చైనా దౌత్యాధికారి ఒకరు తెలిపారు. కాగా రెండ్రోజుల చైనా పర్యటన ముగించుకున్న మోదీ భారత్‌కు చేరుకున్నారు. గతేడాది 73 రోజుల పాటు కొనసాగిన డోక్లాం వివాదంతో దెబ్బతిన్న సంబంధాల్ని పునఃనిర్మించే దిశగా శనివారం మోదీ, జిన్‌పింగ్‌ చర్చలు కొనసాగాయి.

ఇరువురి మధ్య అనధికారిక సమావేశం వివరాల్ని విదేశాంగ కార్యదర్శి విజయ్‌ గోఖలే వెల్లడిస్తూ..‘సరిహద్దు అంశాల పరిష్కారంలో నమ్మకం, పరస్పర అవగాహన నెలకొల్పేందుకు రెండు దేశాల సైన్యాలు సమాచార మార్పిడిని బలోపేతం చేసేందుకు మార్గదర్శకాలను జారీ చేశారు. నమ్మకాన్ని పెంపొందించే దిశగా ఇప్పటికే ఇరు వైపులా ఆమోదించిన నిర్ణయాల్ని నిజాయతీతో అమలు చేయాలని వారి సైన్యాలను రెండు దేశాల అధినేతలు నిర్దేశించారు’ అని చెప్పారు. సరిహద్దు అంశంలో సముచితం, అంగీకారయోగ్యం, పరస్పర ఆమోదనీయమైన ఒప్పందం కోసం పత్యేక ప్రతినిధుల ప్రయత్నాల్ని మోదీ, జిన్‌పింగ్‌లు ఆమోదించారని గోఖలే తెలిపారు.   

ఉగ్రవాద నిరోధంలో సహకరించుకుందాం..
‘శాంతిపూర్వక చర్చల ద్వారా విభేదాల్ని పరిష్కరించుకునేందుకు ఇరుదేశాలకు తగిన పరిణతి, అవగాహన ఉందనే అభిప్రాయంతో ఇరువురు నేతలు ఏకీభవించారు. ఆందోళనలు, ఆకాంక్షలు, సున్నితమైన అంశాల్లో ఇరు దేశాలు ఒకరినొకరు గౌరవించుకోవాలనే విషయాన్ని మోదీ, జిన్‌పింగ్‌లు గుర్తు చేసుకున్నారు. భారత్, చైనాల మధ్య ప్రాంతీయ, అంతర్జాతీయ ఆసక్తులు ఇమిడి ఉన్నాయని, ఆ అంశాలపై విస్తృత స్థాయి సంప్రదింపుల ద్వారా వ్యూహాత్మక చర్యల్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరముందని వారిద్దరు అంగీకరించారు.

పరస్పర అవగాహనను పెంపొందించుకునే క్రమంలో ఆ సంప్రదింపులు సానుకూల ప్రభావాన్ని చూపుతాయని మోదీ, జిన్‌పింగ్‌లు విశ్వసించారు’ అని గోఖలే తెలిపారు. ఉగ్రవాదంతో పొంచి ఉన్న ముప్పును గుర్తించిన ఇద్దరు నేతలు ఉగ్రవాద నిరోధక చర్యల్లో సహకరించుకోవాలని నిర్ణయించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం నిష్పాక్షికంగా సాగాల్సిన అవసరంతో పాటు దానిని కొనసాగించాలని ఇరు నేతలు నొక్కిచెప్పారు. ‘రెండు దేశాల మధ్య వాణిజ్యం సమతూకంతో సాగాలని మోదీ అభిలషించారు. చైనాకు వ్యవసాయ, ఫార్మాస్యూటికల్స్‌ ఎగుమతులకున్న అవకాశాల్ని ప్రధాని ప్రస్తావించారు’ అని తెలిపారు.

ప్రపంచాన్ని మార్చగల శక్తులుగా..
భారత్, చైనాల మధ్య సంబంధాలు స్థిరంగా కొనసాగాల్సిన అవసరముందని, పరస్పర విశ్వాసం ఆధారంగా అభివృద్ధి కొనసాగాలని జిన్‌పింగ్‌ ఆకాక్షించారు. భేటీ వివరాల్ని చైనా ప్రభుత్వ వార్తా సంస్థజిన్హుహ వెల్లడిస్తూ ‘చైనా భారత్‌లు మంచి పొరుగు దేశాలే కాకుండా మిత్ర దేశాలు కూడా.. ప్రపంచాన్ని మార్చగల కీలక శక్తులుగా ఒకరినొకరు పరిగణించుకోవాలి. సానుకూల, న్యాయబద్ధమైన, కలుపుగోలు ప్రవర్తనను తప్పకుండా అలవరచుకోవాలి.అదే సమయంలో పరస్పర ప్రయోజనాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. సమగ్ర సహకారం కోసం ఇరు దేశాలు కలిసి పనిచేయాలి.

భారత్, చైనాలు సన్నిహిత వ్యూహాత్మక చర్చలు కొనసాగించాల్సిన అవసరముంది’ అని మోదీతో చైనా అధ్యక్షుడు తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఇరుదేశాలు మరింత పరిణతితో విభేదాల్ని పరిష్కరించుకోవాలని, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల్లో సమన్వయం, సహకారం బలోపేతం చేసుకోవాలని.. ప్రాంతీయ ఆర్థిక ఏకీకరణ కోసం కృషిచేయాలని జిన్‌పింగ్‌ సూచించినట్లు చైనా మీడియా పేర్కొంది. ఇద్దరు నేతలు వాతావరణ మార్పులు, స్థిరమైన అభివృద్ధి, ఆహార భద్రత అంశాలపై కూడా చర్చించారు. చైనాలోని అతిపెద్ద నది యాంగ్జీ, భారత్‌లో అతిపెద్ద నది గంగా నదుల్ని పరిరక్షణలో తమ అనుభవాల్ని పంచుకున్నారు. ఇరుదేశాల మధ్య క్రీడల ప్రోత్సాహం, బౌద్ధ మతం కేంద్రంగా పర్యాటక అభివృద్ధిపై కూడా మోదీ, జిన్‌పింగ్‌లు చర్చలు జరిపారు.   

మోదీ, జిన్‌పింగ్‌ బోటు షికారు
వుహాన్‌లోని సుందరమైన ఈస్ట్‌ లేక్‌ తీరం వెంట మోదీ, జిన్‌పింగ్‌లు శనివారం విహరించారు. తర్వాత బోటు షికారు చేశారు. ఆ సమయంలో ఇద్దరూ ఎంతో ఆహ్లాదంగా కనిపించారు. ‘ఈస్ట్‌ లేక్‌లో బోటు షికారు గుర్తుండిపోయేలా సాగింది’ అని మోదీ ట్వీట్‌ చేశారు. శాంతి, సామరస్యం, అభివృద్ధి కోసం ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌లు ఒకే బోటులో షికారు చేశారు అని భారత విదేశాంగ ప్రతినిధి రవీశ్‌ ట్వీట్‌ చేశారు.  

దంగల్‌ బాగా నచ్చింది: జిన్‌పింగ్‌
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఆమిర్‌ ఖాన్‌ దంగల్‌ సినిమా బాగా నచ్చిందట.. గతేడాది చైనాలో దాదాపు 1,100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఆ సినిమాను చూసినట్లు మోదీతో జిన్‌పింగ్‌ చెప్పారు. గతంలో ఎన్నో భారతీయ సినిమాలు చూశానని, వాటిలో హిందీ, ఇతర ప్రాంతీయ భాషా చిత్రాలు ఉన్నాయని చైనా అధ్యక్షుడు చెప్పడం విశేషం. ‘మరిన్ని భారతీయ సినిమాలు చైనాలో, చైనా సినిమాలు భారత్‌లో ప్రదర్శిస్తే బాగుంటుందని జిన్‌పింగ్‌ ఆకాంక్షించారు’ అని విదేశాంగ  కార్యదర్శి గోఖలే చెప్పారు. శుక్రవారం తొలిరోజు భేటీ అనంతరం 1982ల నాటి బాలీవుడ్‌ సినిమా ‘యే వదా రహా’లోని ‘తు హై వహీ దిల్‌ నే జిసే అప్నా కహా..’ పాటను చైనా వాద్యకారులు వినిపించారు.

వుహాన్‌లోని ఈస్ట్‌లేక్‌ వద్ద సంభాషించుకుంటున్న మోదీ, జిన్‌పింగ్‌
ఈస్ట్‌లేక్‌లోని బోటులో మోదీ, జిన్‌పింగ్‌ 

మరిన్ని వార్తలు