బ్రిటన్‌ ఆర్థిక మంత్రిగా ‘ఇన్ఫోసిస్‌’ మూర్తి అల్లుడు

14 Feb, 2020 01:33 IST|Sakshi
రిషి సునక్‌

లండన్‌: ‘ఇన్ఫోసిస్‌’ నారాయణమూర్తి అల్లుడు, భారత సంతతి బ్రిటిష్‌ ఎంపీ రిషి సునక్‌(39) భారీ ప్రమోషన్‌ కొట్టేశారు. బ్రిటన్‌ కేబినెట్‌లో చోటుచేసుకున్న భారీ మార్పుల్లో భాగంగా ప్రధాని తర్వాత రెండో స్థానంగా భావించే ఆర్థిక మంత్రి పోస్టు ఆయనకు దక్కింది. ప్రధాని జాన్సన్‌ చీఫ్‌ స్పెషల్‌ అడ్వైజర్‌ డొమినిక్‌ కమ్మింగ్స్‌తో తలెత్తిన విభేదాల కారణంగా ఆర్థిక మంత్రి, పాక్‌ సంతతికి చెందిన సాజిద్‌ జావిద్‌ అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో ఆ తర్వాతి పోస్టు, ఆర్థిక శాఖ చీఫ్‌ సెక్రటరీగా ఉన్న రిషి ఆ బాధ్యతల కోసం ప్రధాని  ఎంపిక చేశారు. తాజా పరిణామంతో భారత సంతతికి చెందిన హోంమంత్రి ప్రీతీ పటేల్, రిషి సునక్‌ కీలక బాధ్యతల్లో ఉన్నట్లయింది.

వీరితోపాటు ఆగ్రాలో జన్మించిన అలోక్‌ శర్మ(52)కు వాణిజ్యం, ఇంధన, పరిశ్రమల విధానం శాఖ మంత్రి, సుయెల్లా బ్రావర్‌మాన్‌(39)ను అటార్నీ జనరల్‌గా బాధ్యతలు అప్పగించారు. ఎక్కువ మంది భారతీయులు కీలకపోస్టుల్లో ఉన్న ఈ మంత్రివర్గాన్ని ‘దేశి కేబినెట్‌ ఇన్‌ యూకే హిస్టరీ’గా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఆర్థిక మంత్రిగా తనపై చాలా బాధ్యతలు ఉన్నాయని రిషి అన్నారు. వచ్చే నెలలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్‌ను రూపొందించాల్సి ఉంది. రిషి తండ్రి వైద్యుడు కాగా, తల్లి ఫార్మసిస్ట్‌. పంజాబ్‌కు చెందిన వీరు లండన్‌లో స్థిరపడ్డారు. 1980లో జన్మించిన రిషి వించెస్టర్‌ కాలేజీ, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీల్లో చదివారు. రిషి సునక్‌ నారాయణమూర్తి కుమార్తె అక్షతను వివాహం చేసుకున్నారు.
 

మరిన్ని వార్తలు