భారతీయ విద్యార్థులకు ఊరట

22 May, 2019 08:38 IST|Sakshi

కఠ్మాండు: ఎంబీబీఎస్‌ చదువుతున్న భారతీయ విద్యార్థులకు ఊరట లభించింది. ఎంబీబీఎస్‌ వార్షిక పరీక్షలకు 32 మంది విద్యార్థులను అనుమతించాల్సిందిగా నేపాల్‌ సుప్రీంకోర్టు స్థానిక విశ్వవిద్యాలయాన్ని మంగళవారం ఆదేశించింది. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడిసిన్‌ నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో పాసవకపోవడంతో వారందరినీ డిబార్‌ చేసిన కొన్ని నెలల తర్వాత ఈ మేరకు ఈ నెల 17న ఉత్తర్వులు జారీచేసింది. త్రిభువన్‌ యూనివర్సీటికి చెందిన  అనుబంధ కళాశాలల్లో చదువుతున్న ఈ విద్యార్థులు భారత్‌లో నిర్వహించే నీట్‌ పరీక్షలో  ఉత్తీర్ణత సాధించారని, ప్రత్యేకంగా నేపాల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులు  కావాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

త్రిభువన్‌ యూనివర్సిటీ అనుబంధ కళాశాలలైన జానకి దేవి మెడికల్‌ కాలేజీ గత సంవత్సరం డిసెంబర్‌ 20న  వీరిని పరీక్షలకు అనుమతించలేదు. దీంతో వారు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోవాల్సి వచ్చింది. దీంతో త్రిభువన్‌ యూనివర్సిటీపై  బాధిత విద్యార్థులు సుప్రీంకోర్టులో కేసు దాఖలుచేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అనుమతించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. విదేశి విద్యార్థులను పరీక్షలు రాయకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది.

మరిన్ని వార్తలు