అందుబాటులోకి సమస్త రోగాలకు చికిత్స....

12 Aug, 2016 19:03 IST|Sakshi
అందుబాటులోకి సమస్త రోగాలకు చికిత్స....

లండన్: మానవుల్లో మధుమేహం నుంచి క్యాన్సర్ వరకు సమస్త రోగాలను నయం చేసేందుకు వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. క్యాన్సర్ సోకిన రోగి ఎముక మూలుగ (బోన్ మ్యారో)ను ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా విజయవంతంగా మార్చడం ద్వారా ఈ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనున్నట్లు స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకలు వెల్లడించారు. ఎలుకల బోన్ మ్యారోలోకి క్యాన్సర్ కణాలను ఎక్కించి, అవి ఎదిగిన తర్వాత వాటిని సురక్షితంగా నాశనం చేయడంలో తాము అద్భుత విజయాన్ని సాధించామని వారు చెప్పారు.

రేడియేషన్ లేదా కీమోథెరపి ద్వారా కాకుండా రెండు యాంటీ బాడీలను ఎలుకల బోన్ మ్యారోలోకి ఎక్కించడం ద్వారా క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో తాము 99 శాతం విజయం సాధించామని, అనంతరం కొత్త బోన్ మ్యారోను విజయవంతంగా ఎలుకల్లోకి ఎక్కించామని వారు ‘సైన్స్ ట్రాన్స్‌లేషనల్ మెడిసిన్ రిపోర్ట్స్’ జనరల్ తాజా సంచికలో వెల్లడించారు. ఏ రోగిలోనైనా లుకేమియా లాంటి బ్లడ్ క్యాన్సర్లకు చికిత్స చేయాలంటే బోన్ మ్యారోలో ఉండే ఆ రక్త మూల కణాలను రేడియేషన్ లేదా కీమో థెరపీ ద్వారా నాశనం చేస్తారు. అనంతరం అవసరమైతే కొత్త బోన్ మ్యారోను ఎక్కిస్తారు. అయితే బోన్ మ్యారో మార్పిడి శస్త్ర చికిత్సల ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా 20 శాతం మంది రోగులు మరణిస్తారు.

లండన్‌లో ఏడాదికి 1200 మంది రోగులకు బోన్ మ్యారో మార్పిడి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. వారిలో 20 శాతం మంది మృత్యువాత పడుతుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ ఆపరేషన్లను అనుమతిస్తున్నారు. ఇప్పుడు తాము రెండు యాంటీ బాడీలను బోన్ మ్యారోలోకి ఎక్కించి క్యాన్సర్ కణాలను ఎలుకల్లో నాశనం చేయడంలో విజయం సాధించామని, త్వరలోనే మానవులపై కూడా ఈ ప్రయోగం నిర్వహిస్తామని స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు తెలిపారు. అయితే ఆ రెండు యాంటీ బాడీలు ఏమిటో ఈ దశలో వెల్లడించేందుకు వారు నిరాకరించారు. ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని వారు చెప్పారు.

ఈ ప్రయోగం మానవుల్లో సక్సెస్ అయితే గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయం, బోన్ మ్యారో లాంటి ఏ శరీర భాగాన్నైనా సులభంగా మార్పిడి లేదా పునరుత్పత్తి చేయవచ్చని, డయాబెటీస్ నుంచి క్యాన్సర్ వరకు సమస్త రోగాలకు చికిత్స అందించవచ్చని పరిశోధకలు చెప్పారు. వారు తమ ప్రయోగాన్ని ‘హోలి గ్రేల్’ అని అభివర్ణించారు. హోలి గ్రేల్ అంటే క్రీస్తు లాస్ట్ సప్పర్‌లో ఉపయోగించిన దివ్య శక్తులుగల చిన్న పాత్ర.

మరిన్ని వార్తలు