ఇండోనేషియా విమానాల్లో ‘భద్రత’ లేదు

29 Oct, 2018 20:16 IST|Sakshi

రేటింగ్‌ వెబ్‌సైట్‌ వెల్లడి

భద్రత ప్రమాణాలు పట్టించుకోని సంస్థలు

కొరవడిన ప్రభుత్వ పర్యవేక్షణ

ఇండోనేషియాలో శనివారం ఉదయం లయన్‌ ఎయిర్‌ సంస్థ విమానం ప్రమాదానికి గువరడంతో దాంట్లో ఉన్న 189 మందీ చనిపోయారు.ఇండోనేషియా విమానయాన చరిత్రలో ఇది రెండో అతిపెద్ద ప్రమాదం.ఇంతకు ముందు1997లో జరిగిన ప్రమాదంలో 214 మంది ప్రాణాలు కోల్పోయారు.ఇతర దేశాలతో పోలిస్తే ఇండోనేషియాలో విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలుస్తోంది. విమానయాన సంస్థల నిర్వహణలోపం, ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడడమే దీనికి కారణమని నిపుణులు భావిస్తున్నారు.
 

లయన్‌ ఎయిర్‌ సంస్థ ఇండోనేషియాలో మలేషియాకు చెందిన ఎయిర్‌ ఆసియా తర్వాత రెండో అతిపెద్ద విమాన యాన సంస్థ.దీనిలో చార్జీలు చాలా తక్కువ. గత ఏప్రిల్‌లో ఈ సంస్థ విమానం ఒకటి గొరంటాలో విమానాశ్రయంలో రన్‌వే నుంచి జారిపోయింది.సెప్టెంబర్‌లో లయన్‌ ఎయిర్‌కు చెందిన రెండు విమానాలు జకార్తా విమానాశ్రయంలో ఢీకొనేంత దగ్గరకివచ్చాయి.రెండు విమానాల రెక్కలు ఒకదానికొకటి తగిలాయి.అయితే,ఈ రెండు ప్రమాదాల్లో ప్రాణనష్టం ఏమీ జరగలేదు.

ఇండోనేషియా విమానయానానికి సంబంధించి భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే అమెరికా, ఐరోపా యూనియన్‌లు 2007 నుంచి తమ దేశాల్లోకి ఇండోనేషియా విమానాల రాకపోకల్ని నిషేధించాయి.అయితే, 2016లో అమెరికా, 2018 జూన్‌లో ఐరోపా యూనియన్‌ ఈ నిషేధాన్ని ఎత్తివేశాయి. నిషేధం తొలగించాకా జరిగిన పెద్ద ప్రమాదం ఇది.

సుహార్తో నాయకత్వం కింద సైనిక పాలనలో ఉన్న ఇండోనేషియా 1997లో ప్రజాస్వామ్యానికి మళ్లింది.పర్యాటక రంగం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని 2000లో విమానయాన రంగంలో ప్రైవేటు సంస్థలకు తలుపులు తెరిచింది. దాంతో అనేక సంస్థలు ఇక్కడ నుంచి సర్వీసులు ప్రారంభించాయి. ప్రస్తుతం దాదాపు 60 విమానయాన సంస్థలు ఇక్కడ పని చేస్తున్నాయి.సంస్థలు ఎక్కువ కావడంతో పోటీ పెరిగి ధరల యుద్ధానికి దారి తీసింది. టికెట్ల రేట్లు పోటీ పడి తగ్గిస్తున్న సంస్థలు నాణ్యత, భద్రత విషయంలో రాజీ పడుతున్నాయి. దీనిపై ప్రభుత్వ పర్యవేక్షణ కూడా కొరవడింది. ఫలితంగా చాలా సార్లు విమానాల్లో లోపాలు తలెత్తడం, సర్వీసులు రద్దవడం జరుగుతోంది.ప్రమాదాలు కూడా పెరిగాయి. 2000 నుంచి తాజా ప్రమాదం వరకు లెక్కిస్తే ఇండోనేషియాలో మొత్తం 45 భారీ ప్రమాదాలు జరిగాయి.1950–1999 మధ్య 35 ప్రమాదాలు జరిగాయి.ఒక్క 1997లో జరిగిన వివిధ ప్రమాదాల్లో మొత్తం 380 మంది చనిపోయారు.

2016లో విమాన భద్రతకు రేటింగ్‌ ఇచ్చే వెబ్‌సైట్‌ ‘ఎయిర్‌లైన్‌ రేటింగ్స్‌ .కామ్‌’ ప్రపంచ వ్యాప్తంగా 407 ప్రధాన విమాన యాన సంస్థలను పరిశీలించింది.దానిలో భద్రతా ప్రమాణాలు ఏ మాత్రం బాలేని 9 సంస్థలు ఇండోనేషియావేనని తేలింది.ఇండోనేషియా ఎయిర్‌లైన్స్‌ ప్రపంచంలోనే ప్రమాదకర సంస్థగా ఆ వెబ్‌సైట్‌ ప్రకటించింది.ఇండోనేషియా ప్రభుత్వం అంతర్జాతీయ విమాన భద్రత ప్రమాణాలను ఏ మాత్రం పాటించడం లేదని అమెరికా ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌  స్పష్టం చేసింది.
 

మరిన్ని వార్తలు