ఎండిన పొట్టలు.. బాగా నిండిన పొట్టలు!

30 Oct, 2017 02:51 IST|Sakshi

ఒక పొట్ట.. రెండు సమస్యలు.. ఒక దేశం.. రెండు పరస్పర విరుద్ధ పరిస్థితులు.. ఓవైపు పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్యలో మన దేశం ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉంది.. అదే సమయంలో అధిక బరువుతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్యలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది.. 

జంక్‌ఫుడ్‌ అనేసరికి అమెరికన్లు వాళ్లు ఎక్కువగా తింటారు.. అందుకే వారంతా లావుగా ఉంటారు.. అని అనుకుంటుంటాం. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎందుకంటే మన దేశంలో  ఊబకాయంతో బాధపడే చిన్నారుల సంఖ్య అమెరికాను దాటిపోయిందట. ఈ జాబితాలో చైనా తొలిస్థానంలో ఉంది. గత దశాబ్ద కాలంలో దేశంలో ఊబకాయంతో బాధపడేవారి సంఖ్య దాదాపు రెట్టింపైంది. లాన్‌సెట్‌ జర్నల్‌ తాజా నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 1975–2016 మధ్య 200 దేశాల్లో బీఎంఐ(బాడీ మాస్‌ ఇండెక్స్‌) ట్రెండ్స్‌పై ఈ సర్వే నిర్వహించారు. ఈ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 5–19 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఊబకాయంతో బాధపడే బాలికల సంఖ్య గత 40 ఏళ్ల కాలంలో 50 లక్షల నుంచి 5 కోట్లకు పెరిగింది. ఇదే వయసు కలిగిన బాలుర సంఖ్య 60 లక్షల నుంచి 7.4 కోట్లకు చేరింది.

ఇక పోషకాహారలోపాన్ని ఊబకాయంతో పోల్చి చూస్తే పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. అటు పోషకాహారలోపం.. ఇటు ఊబకాయం దేశంపై దాదాపు సమానస్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. పోషకాహార లోపం కలిగిన వారి సంఖ్య గత పదేళ్లలో మూడింట ఒక వంతు శాతం తగ్గినా.. ఇప్పటికీ దేశంలో నిర్దేశిత బరువు కంటే తక్కువ ఉన్న, వయసుకు తగ్గ ఎత్తు లేని, పోషకాహార లోపం కలిగిన చిన్నారుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఏ ఇతర దేశాలతో పోల్చి చూసినా ఈ సంఖ్య ఎక్కువే. అయితే, నిరుపేద ఆఫ్రికా దేశాల కంటే ఈ విషయంలో భారత్‌ వెనకబడి ఉండటానికి అధిక జనాభానే కారణం.

మనకంటే తక్కువ ఆదాయం ఉన్న దేశాలు కూడా ప్రజలకు ఆరోగ్యకరమైన, స్థిరమైన ఆహారాన్ని అందిస్తున్నాయి. ఈ విషయంలో మనం వెనుకబడి ఉండటం గమనార్హం. దేశంలో ఊబకాయం కలిగి ఉన్న వారి సంఖ్య ఎక్కువున్న జిల్లాలు ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండగా.. పోషకాహారలోపం ఉన్నవారు ఎక్కువగా ఉన్న జిల్లాల సంఖ్య మధ్య భారతంలో అధికం. ఒబేసిటీ తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంటే.. పోషకాహారలోపం ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలకు కారణమవుతోంది.  

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు