శ్మశానానికి తీసుకెళ్లగా చిన్నారిలో కదలికలు.. ఒక్కసారిగా..

19 Aug, 2023 09:36 IST|Sakshi

కర్ణాటక: చికిత్స పొందుతున్న 8 నెలల చిన్నారి చనిపోయిందని వైద్యులు భావించి తల్లిదండ్రులకు అప్పగించారు. కన్నీరు మున్నీరైన దంపతులు చిన్నారిని శ్మశానానికి తీసుకెళ్లగా కదలికలు కనిపించాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా 90 శాతం నాడి కొట్టుకుంటోందని వైద్యులు గుర్తించి చికిత్సలు ప్రారంభించారు. ధార్వాడ జిల్లా నవలగుంద తాలూకా బసాపుర గ్రామానికి చెందిన బసప్ప పూజార్‌ కుమారుడు (8 నెలలు) ఊపిరి సరిగా ఆడకపోవడంతో హుబ్లీ కిమ్స్‌లో చేర్పించారు.

నాలుగు రోజుల పాటు చికిత్స అందించిన వైద్యులు గురువారం సాయంత్రం.. పల్స్‌రేట్‌ తక్కువగా ఉందని, ఆక్సిజన్‌ తొలగిస్తే బిడ్డ బతకదని తెలిపారు. అనంతరం చిన్నారి చనిపోయిందని చెప్పి తల్లిదండ్రులతో సంతకం తీసుకొని శిశువును అప్పగించారు. శ్మశానానికి తీసుకెళ్లి ఆచారం ప్రకారం నోట్లో పసుపు నీరు పోస్తుండగా బాలుడు ఆశ్చర్యకరంగా చేతులు, కాళ్లను ఆడించాడు. తక్షణమే నవలగుంద ఆస్పత్రికి తరలించారు.

అక్కడ చికిత్స అనంతరం ధార్వాడ సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. నవలగుంద తాలూకా ఆస్పత్రి వైద్యురాలు వై.విద్య మాట్లాడుతూ 90 శాతం మేరకు బిడ్డ ఆరోగ్యంగానే ఉందన్నారు. కిమ్స్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఈ బిడ్డ విషయంలో పూర్తిగా కేసు ఫైల్‌ను, ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను తెలుసుకొని సమగ్రంగా పరిశీలించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

మరిన్ని వార్తలు