మహా సముద్రంలో 438 రోజులు..!

3 Nov, 2016 10:56 IST|Sakshi
మహా సముద్రంలో 438 రోజులు..!

‘లైఫ్‌ ఆఫ్‌ పై’ సినిమా చూసినవారికి సముద్రంలో తప్పిపోయినవారి కష్టాలు అర్థమవుతాయి. తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక, కప్పుకోవడానికి ఒంటినిండా గుడ్డలు లేక.. చావుకు రోజులు లెక్కబెట్టుకుంటూ బతుకుతారు వీరు. చివరకు ఏదో ఒకరోజు వీరికి మోక్షం లభిస్తుంది. మరణించినవారు సముద్రగర్భంలో కలిసిపోతారు. బతికిబట్టకట్టినవారు చరిత్రలో నిలిచిపోతారు. అలా నిలిచి గెలిచినవాడే జోస్‌ సాల్వడార్‌ అల్వరెంజా..!

2012 నవంబర్‌ 17.. తను ఎంతగానో నమ్ముకున్న బోటును ప్రేమగా ముద్దాడి సముద్రంలోకి బయలుదేరాడు అల్వరెంజా. సాల్వడార్‌కు చెందిన ఈ జాలరి.. అప్పటికి 20 ఏళ్ల క్రితమే మెక్సికోకు వలసవచ్చాడు. అక్కడే చేపలు పట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఎప్పటిలాగే చియాపాస్‌ తీరం నుంచి చేపల వేటకు సాగరంపైకి దూకాడు. అయితే, తోడుగా అలవాటైన మిత్రుడు ‘రే పెరేజ్‌’ వెంట రాలేదు. వేరే ఏదో పనిమీద అతడు బయటకు వెళ్లడంతో ఆరోజు అల్వరెంజా బోటెక్కాడు 23 ఏళ్ల కార్దోబా.

చాలా చురుకైన అథ్లెట్, ఆ ఊరి ఫుట్‌బాల్‌ జట్టులో మొనగాడు. కానీ, చేపల వేట మాత్రం కార్దోబాకు పూర్తిగా కొత్త. అంతకు ముందెప్పుడూ ఈ కుర్రాడితో కలిసి పనిచేసిన అనుభవం లేకపోవడంతో మొదట్లో అల్వరెంజా పెద్దగా మాట్లాడేవాడు కాదు. తర్వాత కూడా వీరిద్దరి మధ్యా పెద్దగా మాటలు సాగలేదు. బోట్‌లోని జీపీఎస్, సగం ఛార్జింగ్‌ ఉన్న మొబైల్‌ ఫోన్, పాతకాలం రేడియో, వైర్‌లెస్‌..  వీటితో పాటు కొద్దిపాటి చేపలవేటకు అవసరమైన పరికరాలతో కొద్ది గంటలు బాగానే వేటాడసాగారు. దాదాపు వేట పూర్తి కావస్తోందన్న సమయంలో అతి భయంకరమైన తుపాను వారిని అతలాకుతలం చేసింది.

ఉవ్వెత్తున లేచిపడుతోన్న కెరటాల ధాటికి జీపీఎస్‌ పరికరం పాడైంది. మొబైల్, వైర్‌లెస్‌లు కూడా దాదాపుగా పనిచేయడం ఆగిపోయాయి. ఉన్నట్టుండి బోటు మోటారు చెడిపోయింది. ఈ క్రమంలో చివరగా తమను కాపాడాలంటూ తీరంలోని తమ యజమానికి అల్వరెంజో చేసిన విన్నపాలు వినిపించకుండాపోయాయి. ఇక, విధిలేని పరిస్థితుల్లో ఇద్దరూ బోటులో బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఐదురోజుల పాటు తుపాను వారిని భయపెట్టింది. తర్వాత చూసుకునేసరికి.. వారు మెక్సికో తీరానికి ఏమాత్రమూ దగ్గరగా లేరు.

ఎక్కడో నడిసంద్రంలో కొట్టుకుపోతున్నారు. గమ్యం తెలీని ప్రయాణమే అయింది వారి పరిస్థితి. సముద్రపు వేట మీద అనుభవం లేని కార్దోబాకు తాము తిరిగి తీరానికి చేరుతామనే నమ్మకం పోయింది. ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. దీనికి తోడు వాంతులు చేసుకుంటూ నీరసంగా తయారయ్యాడు. అతడి పరిస్థితి చూసిన అల్వరెంజా చేపలు పట్టి అతడికి ఆహారంగా ఇవ్వాలనుకున్నాడు. కానీ, దురదృష్టమేంటంటే.. చేపల వేటకు అవసరమైన పరికరాలన్నీ తుపానులో కొట్టుకుపోయాయి. దీంతో సాధారణ చేతులతోనే వేటాడటం మొదలుపెట్టాడు అల్వరెంజా. చేపలు, తాబేళ్లు పట్టుకుని వాటి మాంసాన్ని కార్దోబాకు తినిపించాడు. అయితే, ఈ మాంసం అతడి శరీరానికి అంతగా నప్పలేదు. రోజురోజుకీ నీరసంగా తయారయ్యాడు.

సముద్ర ప్రయాణంలో బతికిబట్టకట్టాలంటే ఉత్సాహంగా ఉండాలని అల్వరెంజా ఎంత చెప్పినా కార్దోబా తేరుకోలేకపోయాడు. ఎప్పుడూ ఇంటిపైనే ధ్యాసతో మరింత నీరసించాడు. అలా రెండు నెలలు గడిచాయి. ఈ కాలంలో చేపలు, సముద్రపు పక్షులు, తాబేళ్లను తింటూ కాలం గడిపేవారు వీరిద్దరూ. మంచినీరు దొరక్కపోవడంతో డీహైడ్రేషన్ బారి నుంచి తప్పించుకునేందుకు మూత్రాన్ని తాగి బతికేవారు. కానీ, ఒకరోజు ఉదయాన లేచి చూసేసరికి కార్దోబా మరణించాడు. అతడి శవాన్ని పక్కనే పెట్టుకుని ఆరు రోజుల పాటు పిచ్చివాడిలా మాట్లాడుకునేవాడు అల్వరెంజా. చివరకు ఓ రోజు సముద్రంలో కార్దొబాను పడేయ్యక తప్పలేదు. అలా పద్నాలుగు నెలలు సముద్రంలోనే గడిపిన తర్వాత చిక్కి శల్యమయ్యాడు అల్వరెంజా.

చివరకు అదృష్టం బాగుండి.. 2014 జనవరి 30న మార్షల్‌ ఐల్యాండ్స్‌ అనే చిన్న దీవిలో నగ్నంగా తేలాడు. వెంటనే స్థానికులు చికిత్స అందించడంతో బతికి బట్టకట్టాడు. 438 రోజుల పాటు సముద్రంలో ఒంటరిగా గడిపిన ఏకైక వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు.

మరిన్ని వార్తలు