‘ఆధారాలుంటేనే మసూద్‌ను అరెస్ట్‌ చేస్తాం’

1 Mar, 2019 08:59 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి సరైన ఆధారాలు లభిస్తేనే ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను అరెస్ట్‌ చేశామని పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషి స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా మసూద్‌ను పాకిస్తాన్‌ అరెస్ట్‌ చేయబోదని ఆయన తేల్చిచెప్పారు. జైషే చీఫ్‌ను అరెస్ట్‌ చేయాలంటే పక్కా ఆధారాలుండాలని పేర్కొన్నారు. కాగా మసూద్‌ అజర్‌ పాకిస్తాన్‌లో ఉన్నాడని ఖురేషి అంతకు ముందు నిర్ధారించారు.

సంయుక్త విచారణకు పాక్‌ ప్రతిపాదన
పుల్వామా ఉగ్రదాడి కేసులో ఉమ్మడి విచారణ చేపట్టాలని భారత్‌కు పాకిస్తాన్‌ ప్రతిపాదించింది. మరోవైపు పాక్‌లోనే తలదాచుకున్న మసూద్‌ అజర్‌ ఆరోగ్యం ప్రస్తుతం బాగాలేదని, ఆయన ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నాడని ఖురేషి వెల్లడించారు. 

ఇక భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తొలగి సాధారణ పరిస్థితి నెలకొనేవరకూ భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌తో తాను చర్చలు జరపలేనని ఆయన చెప్పారు. దుబాయ్‌లో ఓఐసీ సదస్సు సందర్భంగా సుష్మా స్వరాజ్‌తో తాను భేటీ కాలేనని ఖురేషి చెప్పుకొచ్చారు. ఈ భేటీకి భారత్‌ను తొలిసారి ఆహ్వానించారని తెలిపారు.

>
మరిన్ని వార్తలు