అమెరికా ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్

22 Jan, 2015 12:35 IST|Sakshi
అమెరికా ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్

కరాచీ: భారత్‌పై ఎలాంటి ఉగ్ర దాడులు జరగకుండా చూడాలన్న అమెరికా ఒత్తిడికి పాకిస్తాన్ తలొగ్గింది.  దీనిలో భాగంగానే హఫీజ్ సయ్యిద్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవాపై  పాక్ తాజాగా నిషేధం విధించింది. భారత్‌ లో సీమాంతర ఉగ్రవాద దాడి జరగకుండా చూడాలని పాకిస్తాన్‌ను అమెరికా అధ్యక్షుడు బరాక్ బబామా హెచ్చరించిన సంగతి తెలిసిందే.

ఒకవేళ అలాంటి దాడి ఏదైనా జరిగితే, అది పాక్ నుంచే జరిగిందని వెల్లడైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ముందస్తు చర్యల్లో భాగంగా జమాత్ ఉద్ దవా పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. భారత గణతంత్ర దినోత్సవంలో పాల్గొనేందుకు ఒబామా భారత్‌లో పర్యటిస్తున్నారు. ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరిగే ఈ వేడుకల్లో పాల్గొంటున్న ఒబామా.. రెండు గంటల కన్నా ఎక్కువ సేపు బహిరంగ వేదికపై ఉండనున్నారు.

 

దీంతో ఆయన భద్రత విషయమై అమెరికా, భారత భద్రతా సంస్థలు మరింత ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా భారత్ లో ఉగ్రవాదులు దాడులు చేసే ప్రమాదం ఉందని ఐబీ (నిఘా సంస్థ) హెచ్చరికలు జారీ చేయడంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని ఎయిర్ పోర్టుల్లో  హై అలర్ట్ ప్రకటించారు.

మరిన్ని వార్తలు