కశ్మీర్‌పై ఐసీజేకి వెళ్తాం: పాక్‌

21 Aug, 2019 03:20 IST|Sakshi
అహ్మద్‌ ఖాన్‌

ఎల్‌వోసీ వెంట పాక్‌ కాల్పులు

ఒక భారత జవాను మరణం

అభినందన్‌ను చిత్రహింసలు పెట్టిన పాక్‌ కమాండో భారత కాల్పుల్లో హతం

ఇస్లామాబాద్‌/జమ్మూ/శ్రీశ్రీనగర్‌: కశ్మీర్‌ అంశాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పాక్‌ తెలిపింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విదేశాంగ మంత్రి ఖురేషి తెలిపారు. కశ్మీర్‌ అంశాన్ని అన్ని అంతర్జాతీయ వేదికలపైనా ప్రస్తావించడంతో పాటు, ఐసీజేలోనూ పిటిషన్‌ వేస్తామని ఆగస్టు 6వ తేదీన జరిగిన పార్లమెంట్‌ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రధాని ఇమ్రాన్‌ ఇటీవల చెప్పారు.

పాక్‌ కాల్పుల్లో భారత జవాను మృతి
నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గ్రామాలు, భారత ఆర్మీ పోస్టులే లక్ష్యంగా పాక్‌ బలగాలు మరోసారి కాల్పులకు తెగబడ్డాయి. పూంచ్‌ జిల్లాలో జరిపిన కాల్పుల్లో ఓ ఆర్మీ జవాను మరణించగా, నలుగురు పౌరులు గాయపడ్డారు. భారత బలగాలు జరిపిన కాల్పుల్లో పాక్‌ ఆర్మీకి భారీ నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. సరిహద్దు వెంబడి కృష్ణా ఘటి, మెందర్‌ ప్రాంతాల్లో మంగళవారం ఉదయం పాకిస్తాన్‌ బలగాలు కాల్పులు ప్రారంభించాయి. ఈ కాల్పుల్లో బిహార్‌కు చెందిన రవిరంజన్‌ సింగ్‌ (36) మరణించగా నలుగురు పౌరులు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.

కాగా, బాలాకోట్‌ దాడుల సమయంలో పాక్‌ విమానాలను మిగ్‌–21తో ఎంతో ధైర్యంగా తరుముకుంటూ వెళ్లిన ఐఏఎఫ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను చిత్రహింసలు పెట్టిన పాక్‌ కమాండో అహ్మద్‌ ఖాన్‌.. భారత సైన్యం కాల్పుల్లో హతమైనట్లు సమాచారం. ఆగస్టు 17వ తేదీన భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుం డగా నక్యాల్‌ సెక్టార్‌లో సైన్యం జరిపిన కాల్పుల్లో అహ్మద్‌ ఖాన్‌ మరణించినట్లు సమాచారం. మిగ్‌ 21 జెట్‌ విమానాన్ని కూల్చేయడంతో తప్పించుకున్న అభినందన్‌ను పాక్‌ సైన్యం పట్టుకున్న విషయం తెలిసిందే.

కాగా, జమ్మూ కశ్మీర్‌లో క్రమంగా ప్రశాంత వాతావరణం నెలకొంటోంది. దాదాపు 15 రోజుల తర్వాత మంగళవారం శ్రీనగర్‌లో వాణిజ్య కేంద్రం లాల్‌ చౌక్‌ వద్ద బారికేడ్లను పోలీసులు తొలగించారు. పలు ప్రాంతాల్లో ఆంక్షలను సడలించారు. శాంతి భద్రతల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో భద్రతా బలగాల మోహరింపు కొనసాగుతోంది. మొబైల్, ఇంటర్నెట్‌ సర్వీసులపై నిషేధం కొనసాగుతోంది. కశ్మీర్లోకి ప్రవేశించేందుకు యత్నించిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆజాద్‌ను జమ్మూ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అడ్డుకుని తిరిగి ఢిల్లీకి పంపేశారు.

మరిన్ని వార్తలు