భారత్ కోసం జీవిద్దాం..పోరాడదాం

18 Nov, 2014 01:12 IST|Sakshi
  • విశ్వ గురువుగా భారత్ రూపొందాలి: మోదీ పిలుపు
  • సిడ్నీ: 125 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చేలా.. భారత్‌ను విశ్వ గురువుగా రూపొందించేలా.. నిపుణుల కోసం ప్రపంచమంతా భారత్ వైపు చూసేలా.. నవీన భారతాన్ని రూపొందిద్దామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ‘దేశం కోసం జీవిద్దాం.. దేశం కోసం పోరాడుదాం’ అంటూ ఆస్ట్రేలియాలోని భారతీయుల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపారు. సిడ్నీలో 20 వేల మందికి పైగా అభిమానులతో కిక్కిరిసిన ‘ఆల్ఫోన్స్ ఎరీనా ఒలంపిక్ పార్క్’ ప్రాంగణంలో సోమవారం మోదీ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు.
    ఊహించని స్థాయిలో లభించిన స్వాగతానికి ఆయన చలించిపోయారు. ‘ఈ గౌరవాన్ని, అభిమానాన్ని చూసి కదిలిపోయాను. ఈ రోజును జీవితంలో మరచిపోలేను. ఈ ఆప్యాయతను భారత ప్రజలకు అంకితమిస్తున్నా’ అని ప్రకటించారు. ఈ అభిమానం వెనుక ఎన్నో అంచనాలున్న విషయం తనకు తెలుసంటూ.. ‘మీరు స్వప్నిస్తోన్న భారత్‌ను నిర్మించాలనే నేనూ తపిస్తున్నా’నన్నారు. ‘మీతోపాటు భారతీయులందరిలో ఉన్న ఈ ఆశావాదం, ఆకాంక్షలు వాస్తవరూపం దాల్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు నడుం కట్టాలి’ అని పిలుపునిచ్చారు. ఇన్నాళ్లూ భారతీయుల కలలు ఎందుకు కలలుగానే మిగిలిపోయాయో తనకర్థం కాలేదంటూ వ్యాఖ్యానించారు.

    ‘ఈ విశ్వానికే మన మాతృదేశం భారత్ గురువుగా అవతరించాలి’ అనే తన ఆధ్యాత్మిక గురువు స్వామీ వివేకానంద స్వప్నాన్ని సభికులకు జ్ఞప్తికి తెచ్చారు. ఆ స్వప్నం నిజమవుతుందన్న విశ్వాసం తనకుందన్నారు. ‘భారత్‌కు మేలు చేకూర్చడం కోసం ఏం చెయ్యాలో అవన్నీ ఇప్పుడు మనం చేద్దాం. ఆ తరువాత విశ్వ మానవాళి ప్రయోజనాల కోసం భారత్ కృషి చేస్తుంది’ అని సభికుల్లో స్ఫూర్తిని నింపారు.
     
    పీఐఓ, ఓసీఐల విలీనం: ‘విదేశాల్లోని భారతీయ పౌరులు(ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా-ఓసీఐ), భారతీయ సంతతి ప్రజలు(పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్-పీఐఓ).. భారత్ నుంచి విదేశాలకు వెళ్లిన ఈ రెండు వర్గాలను రెండు నెలల్లోగా విలీనం చేసి ఒకే స్టేటస్‌గా ఏర్పాటు చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. అహ్మదాబాద్‌లో జనవరి 7న నిర్వహించబోయే ‘ప్రవాస భారతీయ దినోత్సవం’ నాటికి ఈ విలీనం పూర్తవుతుందన్నారు. విదేశాల్లోని భారతీయ సంతతి ప్రజలు చాలాకాలంగా ఈ రెండు స్టేటస్‌లను విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, ఆస్ట్రేలియా నుంచి వచ్చే పర్యాటకులకు భారత్‌లో అడుగిడగానే వీసా అందేలా ‘వీసా ఆన్ అరైవల్’ను కూడా అమలు చేస్తామన్నారు. 2015 ఫిబ్రవరిలోగా ‘సిడ్నీ కల్చరల్ సెంటర్’ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
     
    స్వాతంత్య్రానంతరం జన్మించిన తొలి ప్రధానిని: దేశానికి స్వాతంత్య్రం లభించిన తరువాత జన్మించిన తొలి ప్రధానిగా తనపై ఎంతో బాధ్యత ఉందని భావిస్తున్నానన్నారు. ‘స్వాతంత్య్రం కోసం పోరాడే అదృష్టం మనకు దక్కలేదు. దేశం కోసం ప్రాణాలర్పించలేకపోయాం. కానీ భారత్ కోసం జీవించగలం. భారత్ కోసం పోరాడగలం’ అంటూ సభికుల్లో ఉత్సాహం నింపారు. దేశాన్ని ప్రభుత్వాలు నిర్మించలేవని, ప్రజలే నిర్మిస్తారన్నారు. దేశంలోని యువశక్తిని వివరిస్తూ.. ‘భరతమాతకు 250 కోట్ల భుజాలున్నాయి. అందులో 200 కోట్లు 35 ఏళ్లలోపు యువతవే. మన ఆకాంక్షలను అవి నెరవేర్చగలవు’ అన్నారు.

    స్వచ్ఛ భారత్‌కు సహకరించండి: తాను అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనధన యోజన, మేక్ ఇన్ ఇండియా సహా పలు కార్యక్రమాల గురించి సభికులకు వివరించారు. తన మానసపుత్రిక అయిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి సహకరించాల్సిందిగా ఆస్ట్రేలియాలోని భారతీయులను కోరారు. భారత్ స్వచ్ఛంగా ఉంటే, మరింతమంది పర్యాటకులు వస్తారన్నారు.

    ‘దేవుడు మీకెంతో ఇచ్చాడు. మీ గ్రామాల అభివృద్ధిలో మీరూ పాలు పంచుకోండి. పెద్దపెద్ద పనులే కానక్కరలేదు. గ్రామాల్లో టాయిలెట్లను నిర్మించడం, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేలా కార్యక్రమాలను రూపొందించడం మొదలైనవి చేపట్టండి. అనారోగ్యం పేదల పాలిట శాపం. పరిశుభ్రతపై మీరు దృష్టి పెట్టడమే పేదలకు చేసే గొప్ప సేవ’అని వారికి దిశానిర్దేశం చేశారు. పరిశుభ్ర నీరు, స్వచ్ఛమైన విద్యుత్ సహా మీకు వీలైన రంగాల్లో మీరు వచ్చిన ప్రాంతాల అభివృద్ధికి సహకరించమని వారికి విజ్ఞప్తి చేశారు.
    వాణిజ్యం, విజ్ఞాన శాస్త్రాలు, క్రీడలు.. తదితర రంగాల్లో అసమాన విజయాలు సాధించిన పలువురి పేర్లను ప్రస్తావిస్తూ.. ‘మీరు సాధించిన విజయాలతో మీ కర్మభూమి గర్వపడేలా చేశారు’ అని ఆస్ట్రేలియాలోని భారతీయులను మోదీ ప్రశంసించారు. ‘ఢిల్లీలో రాత్రి బయల్దేరితే మర్నాడు ఉదయానికి చేరుకునే ఆస్ట్రేలియాలో పర్యటించేందుకు ఒక భారత ప్రధానికి 28 ఏళ్లు పట్టింది. ఇకపై అలాంటి ఎదురుచూపులు మీకుండవు’ అన్నా రు. 1986లో నాటి ప్రధాని రాజీవ్ తరువాత ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీనే.
     
    ఇండియా, ఆస్ట్రేలియా.. క్రికెట్!

    భారత్, ఆస్ట్రేలియాల్లో క్రికెట్‌ను, ప్రజాస్వామ్యాన్ని అమితంగా ప్రేమిస్తారని మోదీ పేర్కొన్నారు. ‘భారత ప్రజాస్వామ్యంలోని శక్తిని చూడండి. ప్రజాస్వామ్యమే లేకుంటే నేనిక్కడ ఉండేవాడినా? ప్రజాస్వామ్యంలోని శక్తే నన్నిక్కడ నిల్చోబెట్టింది’ అంటూ భారత ప్రజాస్వామ్య శక్తిసామర్ధ్యాలను వివరించారు. ఆస్ట్రేలియాలో శ్రమకు లభించే గౌరవం తనను అబ్బురపరిచిందని మోదీ పేర్కొన్నారు. ‘ఇక్కడ ఒక శాస్త్రజ్ఞడు క్యాబ్‌ను నడుపుతాడు. దాన్ని అగౌరవంగా భావించడు’ అని ప్రశంసించారు. పరిసరాలను శుభ్రం చేయడం గౌరవం లేని పనేం కాదని అదీ గౌరవం పొందాల్సిన పనేనని స్పష్టం చేశారు.
     
    ఆదివాసీల స్వాగతం

    సిడ్నీలో ఆస్ట్రేలియాలోని ఆదివాసీలు సంప్రదాయ నృత్యాలతో మోదీకి స్వాగతం పలికారు. హోటల్ పుల్‌మ్యాన్‌లోని లాబీలో వారి నృత్యాన్ని మోదీ తిలకిం చారు. చప్పట్లతో ప్రశంసించారు. ఆ డ్యాన్సర్లు మోదీకి తమ సంప్రదాయ ఆయుధం ‘బూమెరాంగ్’ను బహుమతిగా ఇచ్చారు.
     

మరిన్ని వార్తలు