ఉగ్ర ఆనవాళ్లన్నీ అక్కడే!

15 Nov, 2018 02:57 IST|Sakshi
సింగపూర్‌లో మైక్‌ పెన్స్‌తో ప్రధాని మోదీ కరచాలనం

పాక్‌పై మోదీ పరోక్ష వ్యాఖ్య

సింగపూర్‌ పర్యటనలో బిజీబిజీ

అమెరికా ఉపాధ్యక్షుడు పెన్స్‌తో, సింగపూర్, ఆస్ట్రేలియా ప్రధానులతో భేటీ

సింగపూర్‌: అంతర్జాతీయంగా జరుగుతున్న అన్ని ఉగ్రదాడుల ఆనవాళ్లు, మూలాలు ఒకే ప్రాంతంలో ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఆయన ప్రత్యేకంగా ఏ దేశాన్ని ప్రస్తావించకున్నా పాకిస్తాన్‌ను ఉద్దేశించే అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌తో నర్మగర్భంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఆసియాన్‌–ఇండియా సదస్సుకు హాజరయ్యేందుకు రెండు రోజుల సింగపూర్‌ పర్యటనకు వెళ్లిన మోదీ బుధవారం పలువురు దేశాధినేతలతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. మైక్‌ పెన్స్‌తో పాటు సింగపూర్‌ ప్రధాని లీ సీన్‌ లూంగ్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్, థాయిలాండ్‌ ప్రధాని జనరల్‌ ప్రయూత్‌ చాన్‌–ఓ–చాలతో భేటీ అయ్యారు. భారత్‌లో రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ కేంద్రాలను ఏర్పాటుచేయాలని అమెరికా కంపెనీలను కోరారు.  

పెన్స్‌ నోట ముంబై దాడుల మాట..
మోదీ–పెన్స్‌ భేటీలో ఉగ్రవాదం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. ఎలా చూసినా కూడా ప్రపంచంలో జరుగుతున్న అన్ని ఉగ్రదాడుల మూలాలు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నాయని పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. ఇటీవల పలు దేశాల్లో చోటుచేసుకున్న ఉగ్రదాడుల్లో పాకిస్తాన్‌ సంతతి ప్రజల పాత్ర సంగతి ఉన్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించినట్లు తెలుస్తోంది. ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ పార్టీ పాకిస్తాన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీచేయడంపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ, పెన్స్‌ భేటీ వివరాల్ని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్‌ గోఖలే వెల్లడించారు.  ఈ సందర్భంగా భారత్‌లో పర్యటించాలన్న మోదీ ఆహ్వానానికి పెన్స్‌ అంగీకరించారు.

ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు..
సింగపూర్‌ ప్రధాని లీ సీన్‌ లూంగ్‌తో భేటీ అయిన మోదీ..ఆర్థిక సాంకేతికత, ప్రాంతీయ అనుసంధానత, ద్వైపాక్షిక సహకారం తదితరాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. మోదీ, లూంగ్‌ మధ్య సమావేశం ఫలప్రదంగా జరిగిందని విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ చెప్పారు. తర్వాత ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్, థాయిలాండ్‌ ప్రధాని జనరల్‌ ప్రయూత్‌ చాన్‌లతో సమావేశమైన మోదీ..వాణిజ్యం, రక్షణ, భద్రత తదితర రంగాల్లో సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు.

మరిన్ని వార్తలు