గర్భిణులూ వ్యాయామం చేయొచ్చు!

9 Jun, 2016 21:02 IST|Sakshi
గర్భిణులూ వ్యాయామం చేయొచ్చు!

లండన్ః క్రీడాకారులు ప్రతిరోజూ వ్యాయామం చేసి శరీరాన్ని ధృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాల్సి వస్తుంది. అయితే  గర్భం దాల్చిన సమయంలో మహిళలు అటువంటి వ్యాయామాలు చేసేందుకు, పరుగు పెట్టేందుకు అనుమానిస్తారు. ప్రసవం అయ్యే వరకూ పరుగు వంటి వాటి జోలికి పోకుండా ఉండిపోతారు. అటువంటి మహిళలు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు పరిశోధకులు. గర్భంతో ఉన్న మహిళలు సైతం పరిగెట్టవచ్చని, వ్యాయామం చేయొచ్చునని చెప్తున్నారు.

గర్భిణులుగా ఉన్నపుడు క్రీడాకారిణులు వ్యాయామం చేయడం వల్ల ఎటువంటి పత్రికూల ప్రభావం ఉండదని ఇంగ్లాండ్ కు చెందిన అధ్యయనకారులు చెప్తున్నారు.  అథ్లెటిక్ అయిన మహిళల్లో ఎటువంటి రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలు ఉండవని, వీరు వ్యాయామం చేయడంవల్ల గర్భిణికి గాని, లోపల పెరిగే బిడ్డకు గాని సమస్య ఉండదని నార్వైన్ స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్సెస్ ప్రొఫెసర్ కరి బో వెల్లడించారు. అంతేకాదు వీరు ఎక్సర్ సైజ్ చేయడంవల్ల రక్త ప్రసరణ మెరుగవ్వడంతోపాటు, గర్భంలోని పిండం, ప్లాసింటా ధృఢంగానూ, ఆరోగ్యంగాను తయారౌతాయని తెలిపారు. అయితే గర్భిణులు చేసే వ్యాయామం  కాస్త తేలిగ్గా ఉండాలని, ఇంగ్లాండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం తెలుస్తోంది. గర్భిణిలు తేలికపాటి వ్యాయామం, ఏరోబిక్స్ వంటివి చేయడంవల్ల మధుమేహం వచ్చే అవకాశాలు తగ్గడంతోపాటు, మానసిక స్థైర్యాన్ని కూడ కలుగజేస్తుందని చెప్తున్నారు. అయితే వ్యాయామం చేసేప్పుడు ఏమాత్రం కష్టంగా అనిపించినా చేయకుండా ఉండటం మంచిదని హెచ్చరిస్తున్నారు.

కడుపులోని పిల్లలకు ఇబ్బందిగా ఉంటుందేమోనని చాలామంది గర్భిణులు వ్యాయామం చేయడం మానేస్తుంటారని, అయితే వ్యాయామం చేసేప్పుడు బయటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా లేకుండా చల్లబాటున చేయడం ఉత్తమమని ప్రొఫెసర్ బో చెప్తున్నారు. అంతేకాక సరైన వ్యాయామం చేయడంవల్ల కడుపులోని పిల్లలు ఆరోగ్యంగా ఉండటమే కాక, ప్రసవం కూడ సులభం అవుతుందని చెప్తున్నారు.

మరిన్ని వార్తలు