బలవంతపు పెళ్లి నుంచి రక్షణ కల్పించండి

31 Jul, 2019 11:43 IST|Sakshi

లండన్‌ కోర్టులో దుబాయ్‌ రాజు భార్య పిటిషన్‌

లండన్‌: దుబాయ్‌ రాజుతో తనకు జరిగిన బలవంతపు పెళ్లి నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఆయనకు దూరంగా ఉంటున్న భార్య, రాకుమారి హయా (45) లండన్‌ కోర్టును ఆశ్రయించారు. తన పిల్లల సంరక్షణ బాధ్యతలు తనకే అప్పగించాలని, అదేవిధంగా తనపై ఎలాంటి వేధింపులు జరగకుండా చూడాలని ఆమె ఇంగ్లండ్‌, వేల్స్‌ హైకోర్టు ఫ్యామిలీ డివిజన్‌ను అభ్యర్థించారు. దుబాయ్‌ రాజు, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌ ప్రధాని అయిన 70 ఏళ్ల షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషిద్‌ ఆల్‌ మక్తూమ్‌ను వదిలేసి పిల్లలతో సహా పారిపోయి వచ్చిన హయా ప్రస్తుతం లండన్‌లో ఆశ్రయం పొందుతున్నారు.

పిల్లల సంరక్షణ బాధ్యత ఎవరికి అప్పగించాలనే విషయమై ఇద్దరి మధ్య ప్రస్తుతం న్యాయపోరాటం కొనసాగుతోంది. దివంగత జోర్డాన్‌ రాజు హుస్సేన్‌ కూతురు, జోర్డాన్‌ ప్రస్తుత రాజు అబ్దుల్లా-2 సవతి సోదరి అయిన హయా తన బలవంతపు పెళ్లి నుంచి రక్షణ కల్పించే ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం బలవంతపు పెళ్లిని ఆపవచ్చు. ఒకవేళ బలవంతపు పెళ్లి ఇప్పటికే జరిగి ఉంటే.. ఆ వైవాహిక బంధంలో కొనసాగకుండా ఉత్తర్వులు ఇవ్వవచ్చు. ఆమె అభ్యర్థనను స్వీకరించిన కోర్టు మంగళవారం ప్రాథమిక వాదనలను విన్నది. హయా వద్ద ఉన్న తన పిల్లలను తిరిగి దుబాయ్‌కు పంపించాలని దుబాయ్‌ రాజు కూడా పిటిషన్‌ వేసిన విషయాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. 
 

>
మరిన్ని వార్తలు