పిల్లలకే కాదు మీకూ కంట్రోల్‌ అవసరమే

6 Jul, 2018 14:07 IST|Sakshi

ఓ వైపు ప్రపంచమే ఒక కుగ్రామం అయ్యింది. దేశాల మధ్య సరిహద్దులు దూరమవుతున్నాయి. మరో వైపు ఇంట్లోని మనుషులే వేర్వేరు ప్రపంచాల్లో బతుకుతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య అంతులేని దూరం పెరుగుతుంది. ఈ రెండింటికి కారణం ఒక్కటే అదే స్మార్ట్‌ఫోన్‌. మొదట అవసరంగా వచ్చి నేడు వ్యసనంగా మారింది. 2జీ, 3జీ అంటూ ‘జీ’లు పెరుగుతున్న కొద్ది అనుబంధాలు దూరమవుతున్నాయి.

పిల్లల మీద స్మార్ట్‌ఫోన్‌ల ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నట్లు గతంలో చాలా నివేదికలు వెల్లడించిన సంగతి తెలిసిందే. పిల్లలను స్మార్ట్‌ ఫోన్‌కు దూరంగా ఎలా ఉంచాలి, పిల్లలు ఫోన్‌ వినియోగించే సమయాన్ని ఎలా కంట్రోల్‌ చేయాలి అంటూ చాలా సలహాలే ఇచ్చాయి.

అయితే ఈ మధ్య కాలంలో నిర్వహించిన సర్వేలో మాత్రం మరోక ఆశ్చర్యకరమైన అంశం తెలిసింది. అది ఏంటంటే స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం విషయంలో కంట్రోల్‌ చేయాల్సింది పిల్లలను మాత్రమే కాదు తల్లిదండ్రులను కూడా అనే విషయం వెల్లడైంది. స్మార్ట్‌ ఫోన్‌ ద్యాసలో పడి చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను పట్టించుకోవడం లేదంట. ఓ 32 మంది తల్లులతో పాటు వారి రెండేళ్ల వయసు ఉన్న పిల్లల మీద జరిపిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

ఈ పరిశోధనలో ముందు కొందరు తల్లులను వారి పిల్లలకు రెండు కొత్త పదాలను నెర్పించమనే టాస్క్‌ ఇచ్చారు. వారు పిల్లలకు ఆ పదాలు చెప్పే సమయంలో వారి ఫోన్‌ మోగేలా చేశారు. దాంతో వారు పదాలు చెప్పడం ఆపి ఫోన్‌ మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత చెప్పినా కూడా పిల్లలు నేర్చుకోవడానికి అంత ఆసక్తి కనపించలేదని తెలిసింది.

ఇదే టాస్క్‌ను మిగిలిన తల్లులకు ఇచ్చి మధ్యలో ఎలాంటి అంతరాయం కల్గించలేదు. దాంతో వారు పిల్లలకు నేర్పాల్సిన కొత్త పదాలను చక్కగా నేర్పించారు. పిల్లలు కూడా ఈ తల్లులు చేప్పే పాఠాలను శ్రద్ధగా విన్నట్లు సర్వేలో తెలింది. ఈ సర్వే నిర్వహించడానికి ప్రధాన కారణం...నేటి కాలం పిల్లలకు భాషా మీద పట్టు ఏ మాత్రం ఉండటం లేదంట.  స్మార్ట్‌ఫోన్‌లలో  ‘ప్రీ డిఫైన్‌డ్‌ టెక్స్ట్‌’ అందుబాటులో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం అంటున్నారు పరిశోధకులు.

ఒకరితో ఒకరు మాట్లాడటం వల్ల భాషా ప్రావీణ్యం పెరగడమే కాక బంధాలు బలపడే అవకాశం ఉంటుందంటున్నారు  పరిశోధకులు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ 2 -5 ఏళ్ల  పిల్లలతో ఎక్కువ సమయం గడిపితే వారిలో మానసిక, శారీరక వికాసం అధికంగా ఉంటుందని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలతో కలిసి కూర్చుని మాట్లాడటం...ఆడటం వంటివి చేయడం వల్ల పిల్లల మానసికంగా బలంగా తయారవుతారంటున్నాయి నివేదికలు.  

మరిన్ని వార్తలు