రిటైర్మెంట్‌ ఎప్పుడు?

4 Dec, 2018 03:38 IST|Sakshi

యూఏఈలో 49

అమెరికాలో 66

వేర్వేరు దేశాల్లో భిన్న రిటైర్మెంట్‌ వయసులు

జీవితంలో ఏనాటికైనా వచ్చే పదవీ విరమణ ఇప్పుడు ఎన్నికల ప్రచారాస్త్రంగా మారింది. పదవీ విరమణ వయసును పెంచుతామని తెలంగాణలో రాజకీయ పార్టీలు పోటాపోటీ వాగ్దానాల నేపథ్యంలో వేర్వేరు దేశాల్లో రిటైర్మెంట్‌ వయసుపై ఓ లుక్కేస్తే..

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) లో రిటైర్‌మెంట్‌ వయస్సు అతి తక్కువగా ఉంది. 2007 వరకు అక్కడ రిటైర్‌మెంట్‌ వయస్సు 40 ఏళ్లే. ఆ తరువాత క్రమేణా 49 ఏళ్ళకు పెరిగింది. తక్కువ వయసులో రిటైర్మెంట్‌ ఇస్తున్న దేశాల్లో చైనాది రెండో స్థానం. అక్కడ సగటు రిటైర్మెంట్‌ వయసు 56.25 ఏళ్ళు. కొన్ని ఆఫ్రికా దేశాల్లో కూడా తక్కువ వయసులోనే విరమణ పొందుతున్నారు. సెనెగల్, మొజాంబిక్, మడగాస్కర్‌ లలో రిటైర్మెంట్‌ వయస్సు 57.5 ఏళ్ళు.

ఇక భారత్, ఈజిప్ట్, ట్యునీషియా, మొరాకోలలో 58 నుంచి 60 ఏళ్ళు. రష్యా, జపాన్‌ రిటైర్‌మెంట్‌ వయస్సు 60 ఏళ్ళు. రిటైర్‌ అయిన జనాభా అధికంగా భారత్, రష్యా, జపాన్‌లలోనే ఉన్నారు. నార్వేలో 1970 నుంచి అధికారిక ఉద్యోగ విరమణ వయస్సు 67ఏళ్ళు. ఫ్రాన్స్‌లో 62 ఏళ్ళు. 2010లో ఫ్రాన్స్‌లో రిటైర్‌మెంట్‌ వయస్సుని 60 నుంచి 62 ఏళ్ళకు పెంచారు. దీంతో ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే అక్కడి పారిశ్రామిక వేత్తలు మాత్రం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సుని 64 ఏళ్ళకు పెంచాలని కోరుతున్నారు. 

ఫ్రాన్స్‌లో 62 ఏళ్ళకి రిటైర్‌ అయినా, ఐదేళ్ళ తరువాత అంటే 67 ఏళ్ళకి మాత్రమే పూర్తి పెన్షన్‌ పొందే వీలుంది. అందుకే అక్కడి ప్రభుత్వం ప్రజలను ఎక్కువకాలం పనిచేయించాలని భావిస్తోంది. ఇటలీలో పురుషుల పదవీవిరమణ వయస్సు 66.7 ఏళ్లు కాగా, స్త్రీలు పురుషులకన్నా ఒక్క ఏడాది ముందే రిటైర్‌ అవుతారు. నెదర్లాండ్స్‌లో రిటైర్‌మెంట్‌ వయస్సు 2017లో 65.8 ఏళ్ళు. 2018లో 66 ఏళ్ళకు పెరిగింది. దాదాపు చాలా దేశాల్లో ఏటా రిటైర్మెంట్‌ వయస్సుని పెంచుతూనే ఉన్నారు.  ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించే పదవీ విరమణ వయస్సు ఒకటి కాగా,  ప్రజలు పని నుంచి విరామం తీసుకునే వయసు మరొకటిగా ఉంటోంది.

మరిన్ని వార్తలు