చెప్పు వెనుక చరిత్ర.. ‘చెప్పు’కుందామా!

5 Jan, 2018 03:38 IST|Sakshi

నా చర్మం వలిచి చెప్పులు కుట్టించినా.. మీ రుణం తీర్చుకోలేం బాబుగారూ ఈ డైలాగు మనం చాలా సినిమాల్లో విన్నాం.. అయితే.. ఎప్పుడైనా చూశారా? చర్మం వలిచి చెప్పులు కుట్టించడాన్ని!! ఓసారి పక్కనున్న షూపైన లుక్కేసుకోండి.. పై ప్రశ్నకు సమాధానం ఈ ఫొటోనే .. ఎందుకంటే.. ఇది చర్మం వలిచి కుట్టించిన చెప్పే!! అసలు ఇది సాధ్యమా? నిజమా? నిజమైతే.. అసలు ఎవరి చర్మాన్ని వలిచారు? ఎవరికి చెప్పులు కుట్టించారు? జవాబు దొరకాలంటే.. ఓసారి రింగులు తిప్పండి.. ఎందుకంటే.. మనం ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తున్నాం మరి..

1878 సంవత్సరంలో ఒకానొక రోజు.. అమెరికాలోని వయోమింగ్‌ రాష్ట్రం
బిగ్‌ నోస్‌ జార్జ్‌ గ్యాంగ్‌ అలియాస్‌ జార్జ్‌ ప్యారెట్‌ గ్యాంగ్‌ ఓ భారీ దోపిడీకి స్కెచ్‌ వేసింది. జార్జ్‌ ప్యారెట్‌ అంటే అప్పట్లో పేరొందిన బందిపోటు.. అతడికి పొడుగాటి ముక్కు ఉండటంతో అందరూ బిగ్‌ నోస్‌ జార్జ్‌ అని కూడా పిలిచేవారు.. అలాంటి జార్జ్‌ రైలు దోపిడీకి ప్లాన్‌ వేశాడు.. ఇప్పట్లో అంటే అంతా మొబైల్‌ పేమెంట్‌.. అప్పట్లో కాగితపు కరెన్సీనే.. ముఖ్యంగా జీతాల రోజున ఉద్యోగులకు చెల్లించడానికి బాక్సుల్లో డబ్బును రైళ్ల ద్వారా పంపేవారు..

జార్జ్‌ టార్గెట్‌ చేసింది కూడా అలాంటి రైలునే.. అప్పటికే అతడి గ్యాంగు సభ్యులు బోగీల మధ్య ఉన్న లంకెలను లూజ్‌ చేసి పెట్టారు.. బోగీలు విడిపోతే.. వాటిని దోచుకోవచ్చన్నది వీరి ప్లాన్‌.. అయితే.. రైలులో వేరే సీన్‌ నడుస్తోంది.. అప్పటికే దీన్ని పసిగట్టిన రైల్వే సిబ్బంది.. లింక్‌లు లూజ్‌ కాకుండా బిగించి.. పోలీసులకు సమాచారమిచ్చారు.. ఇక్కడ విషయం తెలియని జార్జ్‌.. రైలు కోసం ఎదురుచూస్తున్నాడు.. పోలీసులు వచ్చేశారు.. కాల్పులు.. గ్యాంగ్‌ సభ్యులు పారిపోయారు.. అయితే.. డిటెక్టివ్‌ టిప్‌ విన్సెంట్‌.. వయోమింగ్‌ డిప్యూటీ పోలీసు అధికారి రాబర్ట్‌లు బిగ్‌ నోస్‌ జార్జ్‌ను వెంటాడుతూ వెళ్లారు.. కానీ.. అంతలోనే.. ధన్‌.. ధన్‌ అంటూ శబ్దం.. జార్జ్‌ తుపాకీ గురి తప్పలేదు..


ఈ రాబర్ట్‌.. విన్సెంట్‌ మరణం పెద్ద సంచలనమైంది..
జార్జ్‌ తలపై వెలను 20 వేల డాలర్లుగా ప్రకటించారు.. రెండేళ్లు.. బిగ్‌ నోస్‌ హవా కొనసాగింది.. ఒకరోజు మోంటానాలోని బార్‌లో జార్జ్‌ తాగి వాగాడు.. పోలీసులను తానెలా చంపిం దీ గొప్పలు పోయాడు.. ఎవరో విషయం అధికారులకు చేరవేశారు.. వారొచ్చి.. తాగి పడున్న జార్జ్‌ను అరెస్టు చేసి తీసుకు పోయారు.. కోర్టులో విచారణ జరిగింది.. జార్జ్‌కు ఉరిశిక్ష పడింది.. సీన్‌ కట్‌ చేస్తే..


1881 మార్చి 21 అర్ధరాత్రి.. జార్జ్‌కి ఉరి వేయడానికి 10 రోజుల ముందు...
జైలు నుంచి తప్పించుకోవడానికి బిగ్‌ నోస్‌ ప్లాన్‌ వేశాడు.. బయట పడేవాడే.. కానీ చివరి నిమిషంలో దొరికిపోయాడు.. విషయం జనానికి తెలిసింది.. ఆగ్రహం కట్టలు తెంచుకుంది. జైల్లోకి దూసుకెళ్లారు.. జార్జ్‌ను బయటికి లాగి.. టెలిఫోన్‌ స్తంభానికి కట్టేసి.. ఉరేశారు.. అతడి శవాన్ని తీసుకెళ్లడానికి సంబంధీకులు ఎవరూ లేకపోవడంతో థామస్, జాన్‌ ఓస్‌బర్న్‌ అనే వైద్యులు తమ ప్రయోగాల నిమిత్తం వాడుకోవడానికి తీసుకెళ్లారు.

అతడి క్రిమినల్‌ మనస్తత్వాన్ని అధ్యయనం చేయడానికి వీలుగా అతడి మెదడులో ఏమైనా తేడా ఉందేమో పరిశీలించిడానికి జార్జ్‌ పుర్రె భాగాన్ని రెండుగా కోశారు. తర్వాత తర్వాత జాన్‌ చాలా చిత్రవిచిత్ర పనులకు పాల్పడ్డాడు. తాను ధరించడానికి వీలుగా జార్జ్‌ చర్మాన్ని వలిపించి.. డెన్వర్‌లోని ఓ ఫ్యాక్టరీలో షూ తయారుచేయించాడు. మిగతా బాడీని ఉప్పు నీటి మిశ్రమం కలిగిన పీపాలో ఉంచాడు.. పలు ప్రయోగాల తర్వాత ఆ పీపాను భూమిలో పాతించాడు.

ఇంకో విషయం తెలుసా? 1893లో వయోమింగ్‌ గవర్నర్‌గా కూడా ఎన్నికైన జాన్‌.. తన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జార్జ్‌ చర్మంతో తయారుచేసిన షూనే ధరించాడని చెబుతారు. తర్వాత చాన్నాళ్ల వరకూ బిగ్‌ నోస్‌ పేరు ఎక్కడా వినిపించలేదు.. 1950ల్లో మళ్లీ జార్జ్‌ పేరు వార్తల్లోకెక్కింది. ఓ చోట భవన నిర్మాణం కోసం తవ్వుతుండగా.. ఆ పీపా బయటపడింది.

అంతటి మహాబందిపోటు చెప్పుగా మారిన చరిత్ర బయటికొచ్చింది.. ఇప్పుడా చెప్పులు, జార్జ్‌ పుర్రె వంటివి వయోమింగ్‌లోని కార్బన్‌ కౌంటీ మ్యూజియంలో ఉన్నాయి. జార్జ్‌ చర్మంతోనే ఓ మెడిసిన్‌ బ్యాగ్‌ను కూడా తయారు చేయించారని చెబుతారు. అది మాత్రం ఇప్పటికీ దొరకలేదు. అదీ దొరికితే.. ఆ కథను పార్ట్‌–2గా చెప్పుకుందాం.. ప్రస్తుతానికి ఇదండీ.. చెప్పు తాలూకు చరిత్ర!

– సాక్షి, తెలంగాణ డెస్క్‌

మరిన్ని వార్తలు