ఖతార్‌ దేశం ఇకపై ద్వీపం!

2 Sep, 2018 03:26 IST|Sakshi

సరిహద్దు భూభాగాన్ని వేరుచేస్తూ కాలువ తవ్వే యోచనలో సౌదీ

రియాద్‌: ఇప్పటికే సంబంధాలు దెబ్బతిన్న సౌదీ అరేబియా, ఖతార్‌ల మధ్య చిచ్చుపెట్టే మరో అంశం తెరపైకొచ్చింది. ఖతార్‌ సరిహద్దులో 60 కి.మీ పొడవు, 200 మీటర్ల వెడల్పుతో ఓ కాలువను తవ్వాలని సౌదీ అరేబియా యోచిస్తోంది. ఈ కాలువ వల్ల ద్వీపకల్పంగా ఉన్న ఖతార్‌ దీవిగా మారుతుందని స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. ఈ ప్రాజెక్టు సాకారమైతే సౌదీ ప్రధాన భూభాగం నుంచి ఖతార్‌ ద్వీపకల్పం పూర్తిగా వేరుపడుతుందని తెలిపాయి. కాలువలో కొంత భాగాన్ని అణు వ్యర్థాల శుద్ధి ప్లాంట్‌కు కేటాయించాలని సౌదీ ప్రణాళికలు సిద్ధంచేస్తున్నట్లు తెలిసింది.

ప్రతిపాదిత సాల్వా దీవి ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉందని సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ సలహాదారుడు సౌద్‌ అల్‌–కాటాని శుక్రవారం ట్వీట్‌ చేశారు. ఉగ్రవాదానికి మద్దతిస్తూ ఇరాన్‌కు సన్నిహితంగా మెలుగుతోందని ఆరోపిస్తూ సౌదీ, యూఏఈ, బహ్రెయిన్, ఈజిప్టు దేశాలు గతేడాది ఏప్రిల్‌లో ఖతార్‌తో దౌత్య సంబంధాలు తెంచుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత ఖతార్‌కు ఉన్న ఏకైక భూ సరిహద్దును మూసేసారు. ఆ దేశ విమానాలు తమ గగనతలాన్ని వినియోగించుకోకుండా పొరుగుదేశాలు నిషేధం విధించాయి. సంక్షోభాన్ని పరిష్కరించడంలో అమెరికా, కువైట్‌ల మధ్యవర్తిత్వం విఫలమైంది. సాల్వా కాలువ ప్రాజెక్టుపై ఖతార్‌ స్పందించలేదు.

మరిన్ని వార్తలు