ఆ దోమ కుట్టినా మలేరియా రాదట..

24 Nov, 2015 17:30 IST|Sakshi
ఆ దోమ కుట్టినా మలేరియా రాదట..

కాలిఫోర్నియా: ప్రాణాంతక మలేరియా వ్యాధి సంక్రమాన్ని నిరోధించేందుకు శాస్త్రవేత్తలు ఎన్నిరకాల మందులను కనిపెట్టినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. దోమల నుంచి సంక్రమించే ప్లాస్మోడియం పరాన్న జీవి వల్ల మానవులకు మలేరియా వ్యాధి వస్తోందన్న విషయం తెలిసిందే. అసలు ప్లాస్మోడియం పరాన్న జీవిని దోమలోనే చంపేస్తే అన్న ఆలోచన అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలకు వచ్చింది.
 అంతే...ఓ రకమైన దోమ డీఎన్‌ఏను జన్యు మార్పిడి పద్ధతి ద్వారా మార్చేసి ప్లాస్మోడియం పరాన్న జీవిని నియంత్రించడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. అంటే దోమలోకి ప్లాస్మోడియం పరాన్న జీవి ప్రవేశించగానే దోమలో వచ్చిన జన్యు మార్పుల కారణంగా ఆ పరాన్న జీవి ఆదిలోనే చచ్చిపోతుంది. ఫలితంగా ఆ దోమ మానవులను కుట్టినప్పటికీ మలేరియా సోకే ప్రసక్తే లేదన్న మాట. జన్యు మార్పిడికి గురైన దోమకు పుట్టే పిల్ల దోమలకు కూడా ఈ పరాన్న జీవిని బతక్కుండా నిరోధించే శక్తి వస్తుంది. కనీసం మూడు తరాల వరకు దోమ జాతిలో జన్యుపరంగా ఈ శక్తి సంక్రమిస్తుందని పరిశోధక నిపుణుల బృందానికి నాయకత్వం వహించిన డాక్టర్ ఆంథోని జేమ్స్ వివరించారు. దోమ డీఎన్‌ఏ జన్యు మార్పిడి ప్రక్రియకు 'క్రిస్పర్' అని నామకరణం కూడా చేశారు.
 
ఈ జన్యు మార్పిడి ప్రక్రియ కోసం భారత్‌లో కనిపించే 'అనోఫెలెస్ స్టెఫెన్సీ' జాతికి చెందిన దోమను ఎంపిక చేసుకున్నారు. ఇలా ప్రతి జాతికి చెందిన దోమలను ఎంపిక చేసి ల్యాబ్‌లో జన్యు మార్పిడి ద్వారా ప్లాస్మోడియం పరాన్న జీవిని ఎదుర్కొనే శక్తిని కలిగిస్తూ పోతే కొంతకాలానికి వాటి సంతానానికి కూడా ఈ శక్తిని ప్రసాదించవచ్చు. అలా చేసినట్టయితే కొంతకాలానికి ఏ రకమైన దోమలు మానవులను కుట్టినా మలేరియా వ్యాధి సంక్రమించదు. ఇదొక్కటే మలేరియాను సమూలంగా నిర్మూలించలేదని, ఇదొక మార్గం మాత్రమేనని డాక్టర్ ఆంథోని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, శక్తివంతమైన మందులను కనుగొనడం, మలేరియా సోకినప్పుడు వాటిని వాడడం తప్పనిసరని ఆయన చెప్పారు. ఎందుకంటే, దోమ జాతులన్నింటిలో డీఎన్‌ఏలో జన్యు మార్పిడి తీసుకరావడం అంత సులభం కాదు.
 ప్రపంచ వ్యాప్తంగా 320 కోట్ల మంది, అంటే దాదాపు ప్రపంచ జనాభాలో సగం మంది మలేరియా ముప్పును ఎదుర్కొంటున్నారు. వారిలో ఏడాదికి 5,80,000 మంది మృత్యువాత పడుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అసలు ప్లాస్మోడియం పరాన్న జీవికి వాహకంగా పనిచేస్తున్న దోమ జాతినే నిర్మూలిస్తూ పోవడం శ్రేయస్కరంగదా! అన్న ఆలోచన శాస్త్రవేత్తలకు రాకపోలేదు. అలాంటి చర్యలు తీసుకున్నట్లయితే పర్యావరణ సమతౌల్యత దెబ్బతింటుందని, ఇప్పటికే దోమల ద్వారా నశించిపోతున్న ఇతర రకాల పరాన్న జీవులు మరోరకంగా విజృంభించే అవకాశం ఉందని కొంత మంది శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ వస్తున్నారు.

మరిన్ని వార్తలు