‘అవిశ్వాసం’లో ఓడిన రాజపక్స

15 Nov, 2018 03:28 IST|Sakshi
రాజపక్స

కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ పార్లమెంటులో బుధవారం ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఇటు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగానే ప్రతిపక్ష యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ, ఇతర చిన్నాచితకా పార్టీలతో పాటు రాజపక్స కేబినెట్‌లోని మంత్రులు తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. దీంతో తాజా ప్రధాని మహింద రాజపక్స సభ విశ్వాసాన్ని కోల్పోయినట్లు స్పీకర్‌ జయసూర్య ప్రకటించారు. రాజ్యాంగానికి లోబడి తదుపరి చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడు సిరిసేనకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తేవీలుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. మరోవైపు రాజపక్స ప్రభుత్వం జారీచేసే ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని సైన్యం, ప్రభుత్వ అధికారులకు మాజీ ప్రధాని విక్రమసింఘే పిలుపునిచ్చారు. త్వరలోనే శ్రీలంకలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 

మరిన్ని వార్తలు