చనిపోయిన వారితో చాటింగ్‌!

4 Mar, 2018 04:00 IST|Sakshi

చనిపోయిన వారితో చాటింగ్‌ చేయడం ఏంటి..? కాస్త విడ్డూరంగా ఉందా.. ఇది వాస్తవంగా వాస్తవం. మీకిష్టమైన వారు మీకు దూరం అయినప్పుడు వారితో మాట్లాడే వీలు కలిగిస్తామని చెబుతోంది స్వీడన్‌కు చెందిన అంత్యక్రియలు నిర్వహించే ఓ కంపెనీ. కృత్రిమ మేధస్సుతో దీన్ని సాధ్యం చేస్తామంటోంది ఫెనిక్స్‌ వాంటింగ్‌ అనే కంపెనీ. అయితే ఇందుకు సోఫియా లాంటి రోబోనో తయారు చేయట్లేదు. ‘బోట్స్‌’ అనే కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ను ఇందుకోసం ఆ కంపెనీ రూపొందించాలని భావిస్తోంది. ఈ ప్రోగ్రాం ద్వారా చనిపోయిన వారు కూడా మనతో మాట్లాడుతున్నట్లే ఉంటుందని చెబుతోంది.

ఈ కంపెనీకి చెందిన కృత్రిమ మేధతో కూడిన చాట్‌బోట్‌లో అంత్యక్రియలకు సంబంధించి వివరాలను తెలుసుకునేందుకు కస్టమర్లు చాటింగ్‌ చేస్తుంటారు. అయితే వారు నిజంగా మనిషితో చాట్‌ చేస్తున్నట్లు వారు పొరపడతారని ఫెనిక్స్‌ సీఈవో చార్లెట్‌ రునియస్‌ పేర్కొన్నారు. దీన్ని ఆధారంగా చేసుకుని చనిపోయిన వారు తమ బంధువులతో చాటింగ్‌ చేసినట్లు ప్రోగ్రామింగ్‌ చేస్తామని చెప్పారు. ఇదంతా ఓ ఊహలా ఉన్నా ప్రస్తుతం ఉన్న సాంకేతికత ఇదంతా సుసాధ్యం చేయగలదని ఆమె చెబుతున్నారు. అచ్చు ఇలాంటిదే రష్యాలో యూజినా అనే ప్రోగ్రామర్‌ తయారు చేశారట. ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి చెందిన ఆమె కారుప్రమాదంలో
చనిపోయిన స్నేహితుడితో చాటింగ్‌ కూడా చేశారట.  

మరిన్ని వార్తలు