అది అమెరికా విమానం.. మేమే కూల్చేశాం!

28 Jan, 2020 10:54 IST|Sakshi

ఆఫ్గనిస్తాన్‌ విమాన ప్రమాదంపై తాలిబన్‌ గ్రూపు

కాబూల్‌: ఆఫ్గనిస్తాన్‌లో సోమవారం చోటుచేసుకున్న ప్రమాదంలో కూలిన విమానం అమెరికా సైన్యానికి చెందినదని తాలిబన్‌ గ్రూపు ప్రకటించింది. ఈ ఘటనలో భారీగా ప్రాణనష్టం సంభవించిందని పేర్కొంది. ఈ మేరకు తాలిబన్‌ గ్రూపు అధికార ప్రతినిధి జుబిహుల్లా ముజాహిద్‌ మాట్లాడుతూ.. ఘాంజీ ప్రావిన్స్‌లో జరిగిన విమాన ప్రమాదానికి తామే కారణమని పేర్కొన్నాడు. సోమవారం మధ్యాహ్నం 1:10 గంటలకు అఫ్గాన్‌ రాజధాని కాబూల్‌కు 130 కిలోమీటర్ల దూరంలో మంటలు చెలరేగి విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఘటనాస్థలమైన దేహ్‌ యాక్‌ ప్రాంతం తాలిబన్ల అధీనంలో ఉన్నందున ఈ ఘటన గురించిన వివరాలు సేకరించడం అధికారులకు కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో విమాన ప్రమాదానికి బాధ్యత వహిస్తూ తాలిబన్‌ గ్రూపు ప్రకటన విడుదల చేసింది. అమెరికా సైనిక స్థావరానికి 10 కిలోమీటర్ల దూరంలో విమానాన్ని కూల్చేశామని పేర్కొంది. 

కాగా అమెరికా సైనికాధికారులు మాత్రం తాలిబన్ల వ్యాఖ్యలను కొట్టిపడేశారు. విమాన ప్రమాద ఘటనపై అమెరికా సైన్యం విచారణ జరుపుతోందని.. ఈ ఘటనలో తాలిబన్ల ప్రమేయం ఉందా లేదా అన్న విషయం త్వరలోనే తేలుతుందని పేర్కొన్నారు. ఇక ప్రమాదానికి గురైంది ఆఫ్గనిస్తాన్‌ జాతీయ విమాన సంస్థ అరియానా ఆఫ్గాన్‌కు చెందిన పౌర విమానం అంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఘటనకు సంబంధించిన ఫొటోలు విడుదలయ్యాయి. వీటి ఆధారంగా... సదరు విమానం ఆఫ్గనిస్తాన్‌ గగనతలంపై నిఘా నిర్వహించే అమెరికా సైన్యానికి చెందినదని పలువురు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఘటనకు తామే కారణమంటూ తాలిబన్లు ముందుకు రావడం గమనార్హం. ఇక మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాక్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై.. ఇరాన్‌ తరచుగా రాకెట్‌ దాడులకు పాల్పడుతున్న విషయం విదితమే. 

ఆఫ్గనిస్తాన్‌లో  విమాన ప్రమాదం!

మరిన్ని వార్తలు