సోమాలియాలో ఉగ్రదాడి

14 Jul, 2019 04:58 IST|Sakshi
దాడిలో ధ్వంసమైన హోటల్‌

26 మంది మృతి

మొగదిషు: దక్షిణ సోమాలియాలోని సరిహద్దు పట్టణం కిస్మాయోలో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది చనిపోగా 56 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక మెదినా హోటల్‌లోకి సైనిక దుస్తులు ధరించిన కొందరు ఉగ్రవాదులు యథేచ్ఛగా కాల్పులు జరుపుతూ ప్రవేశించారు. అదే సమయంలో పేలుడు పదార్థాలతో కూడిన వాహనంపై మరో ఉగ్రవాది ప్రవేశించి తనను తాను పేల్చేసుకున్నాడు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదులతో తలపడ్డాయి. ఇరువర్గాల మధ్య కాల్పులు 12 గంటలపాటు కొనసాగాయి.

ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు సహా కెన్యా, టాంజానియా, అమెరికా, బ్రిటన్, కెనడా దేశాలకు చెందిన పౌరులు కలిపి మొత్తం 26 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు చైనీయులు కూడా గాయపడ్డారన్నారు. పేలుడు ధాటికి హోటల్‌ భవనం ధ్వంసమయ్యింది. ఈ దుశ్చర్యకు తామే కారణమని అల్‌ షబాబ్‌ ప్రకటించుకుంది. సోమాలియా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అల్‌ఖైదా అనుబంధ ఉగ్ర సంస్థ అల్‌ షబాబ్‌ దశాబ్ద కాలంగా విధ్వంసక చర్యలకు పాల్పడుతోంది.
 

>
మరిన్ని వార్తలు