ఒబామా కేర్‌ రాజ్యాంగ విరుద్ధం

16 Dec, 2018 02:18 IST|Sakshi

టెక్సస్‌ ఫెడరల్‌ జడ్జి తీర్పు

హర్షం వ్యక్తం చేసిన అధ్యక్షుడు ట్రంప్‌  

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కు రాజకీయపరంగా ఓ కీలక విజయం లభించింది. గత అధ్యక్షుడు ఒబామా హయాం లో రూపొందిన ప్రతిష్టాత్మక ఆరోగ్య బీమా పథకం ‘ఒబామా కేర్‌’రాజ్యాంగ విరుద్ధమంటూ ఓ కోర్టు తీర్పునిచ్చింది. తాము అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని రద్దు చేస్తామంటూ ట్రంప్‌ ఎన్నికల హామీ ఇచ్చారు. తాజా తీర్పుతో ఈ హామీని అమలు చేసేందుకు మార్గం సుగమమైంది. ఒబామా కేర్‌ పథకం రాజ్యాంగబద్ధమైనదేనంటూ 2012, 2015లలో అమెరికా సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది. అయితే, ఈ పథకానికి వ్యతిరేకంగా అధికార రిపబ్లికన్‌ పార్టీకి చెందిన రాష్ట్రాల గవర్నర్లు, రాష్ట్రాల అటార్నీలు కలిసి టెక్సస్‌ కోర్టులో ఈ ఏడాది దావా వేశారు.

ఈ పథకంలో పేరు నమోదు చేసుకునేందుకు ఆఖరి గడువైన శనివారమే ఈ తీర్పు వెలువడటం గమనార్హం. పథకంలోని నిబంధనల ప్రకారం.. గడువులోగా పేరు నమోదు చేయించుకోని పౌరులు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. టెక్సస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్ట్‌ జడ్జి రీడ్‌ ఓ కానర్‌ తన తీర్పులో..‘పన్ను విధించేందుకు కాంగ్రెస్‌కు వీలుకల్పించే పథకంగా ఇది ఉండరాదు. వ్యక్తిగత జరిమానా చెల్లించాలన్న షరతు రాజ్యాంగ విరుద్ధం. మిగతా పథకం నుంచి ఈ నిబంధనను వేరు చేయలేం. మొత్తంగా ఈ పథకం వృథా’అని పేర్కొన్నారు. ఈ తీర్పుపై ట్రంప్‌ హర్షం వ్యక్తం చేశారు. ‘వావ్‌.. ఈ తీర్పు ముందుగా ఊహించిందే. అమెరికా ప్రజలకు ఇది గొప్ప వార్త. మెరుగైన ఆరోగ్య పథకం, ప్రజలకు అనుకూలమైన నిబంధనలతో కూడిన చట్టాన్ని తీసుకురావడం కాంగ్రెస్‌ బాధ్యత’అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అయితే, టెక్సస్‌ కోర్టు తీర్పును ప్రతిపక్ష డెమోక్రట్లు తీవ్రంగా వ్యతిరేకించారు. అధ్యక్షుడు ట్రంప్‌ అనుకూల జడ్జి ఈ తీర్పు చెప్పారని విమర్శించారు.

మరిన్ని వార్తలు