ఆరని ‘జెరూసలేం’ ఆగ్రహజ్వాలలు

9 Dec, 2017 02:42 IST|Sakshi

జెరూసలేం: ఇజ్రాయెల్‌ రాజధానిగా జెరూసలేంను గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. శుక్రవారం  వివిధ దేశాల్లో ముస్లింలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. పాలస్తీనాలోని గాజా, వెస్ట్‌బ్యాంక్‌లో భారీ సంఖ్యలో నిరసన కారులు రోడ్లపైకి వచ్చారు. ట్రంప్‌ చిత్రాలను, ఇజ్రాయెల్, అమెరికా జాతీయ పతాకాలను దహనం చేయటం వంటి చర్యలతో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెస్ట్‌బ్యాంక్‌లో ఆందోళనకు దిగిన నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయుగోళాలు, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు.

గాజా, ఇజ్రాయెల్‌ సరిహద్దుల్లో ఆందోళన కారులు భద్రతా దళాలతో తలపడ్డారు. ఇరాన్, ఇండోనేసియా, మలేసియా, పాక్, జోర్డాన్‌లలో ప్రదర్శనలు నిర్వ హించారు. అమెరికా ముస్లింలను అణచివేస్తోందంటూ తీవ్రవాద సంస్థ అల్‌కాయిదా ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా, దాని మిత్ర దేశాలు, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పవిత్ర యుద్ధం చేయాలని ముస్లిం ప్రపంచానికి పిలుపునిచ్చింది. మరో సాయుధ పోరాటానికి సిద్ధం కావాలని పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్‌ ప్రజలను కోరింది. 

ట్రంప్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, తీవ్రవాద సంస్థ జమాత్‌ ఉద్‌ దవా(జేయూడీ)నేత హఫీజ్‌ సయీద్‌ లాహోర్‌లో భారీ ర్యాలీ చేపట్టాడు. శ్రీనగర్‌తోపాటు కశ్మీర్‌వ్యాప్తంగా శాంతియుత ప్రదర్శనలు జరిగాయి. నిరసనకారులు అమెరికా వ్యతిరేక నినాదాలు చేశారు.  మధ్య ఆసియా ప్రాంతం మరింత అస్థిరతకు గురి కానుందని పలువురు యూరోపియన్‌ యూనియన్‌ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి ప్రక్రియకు ఈ నిర్ణయం విఘాతం కలిగిస్తుందని, ఈ ప్రాంత సుస్థిరతకు మరో సవాలుగా మారనుందని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మానుయేల్‌ మేక్రాన్‌ తెలిపారు.

వాస్తవాల ఆధారంగానే నిర్ణయం: వైట్‌హౌస్‌
వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే జెరూసలేంను ఇజ్రాయెల్‌ రాజధానిగా ప్రకటించామని అమెరికా అధ్యక్ష భవనం ప్రకటించింది. అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయం సబబేనని, మధ్య ఆసియాలో శాంతి స్థాపనకు అమెరికా కట్టుబడి ఉంటుందని తెలిపింది. కాగా,  మాజీ అధ్యక్షులు బరాక్‌ ఒబామా, బిల్‌ క్లింటన్, జార్జ్‌బుష్‌ చేయలేకపోయిన పనిని తాను ధైర్యంగా చేశానని  ట్రంప్‌ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి జార్జ్‌బుష్, బిల్‌క్లింటన్‌లు చేసిన ఉపన్యాసాల వీడియోలను విడుదల చేశారు. ఒబామా ఇజ్రాయెల్‌ రాజధానిగా పలుమార్లు పేర్కొన్నారని ఉదహరించారు.

మరిన్ని వార్తలు