చైనా శాస్త్రవేత్తల కంటికి ఎనిమిది వైరస్‌లు.. మహమ్మారులుగా మారనున్నాయా?

26 Oct, 2023 11:42 IST|Sakshi

ప్రపంచాన్ని 2019లో తాకిన కరోనా వైరస్‌ భయం అందరినీ నేటికీ వెంటాడుతూనే ఉంది. అ తరువాత కరోనా వైరస్‌ ఆల్పా, బీటా, ఓమిక్రాన్.. ఇలా పలు రూపాలను మార్చుకుని జనంపై దాడి చేస్తూనే వస్తోంది. కరోనా వైరస్ తొలిసారిగా చైనా నగరమైన ఊహాన్‌లో బయటపడింది. 

అనంతరం నెమ్మదిగా ప్రపంచం అంతటా విస్తరించింది. కోవిడ్-19కి వ్యాక్సిన్ కనుగొన్న తరువాత కూడా కరోనా ప్రభావం కనిపిస్తూనే ఉంది. ఇదిలావుండగా  చైనా దక్షిణ తీరంలోని ఉష్ణమండల ద్వీపమైన హైనాన్‌లో గతంలో ఎన్నడూ చూడని ఎనిమిది రకాల వైరస్‌లను చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎలుకల్లో ఈ వైరస్‌లను గుర్తించారు. ఎప్పుడైనా ఈ వైరస్‌లు ఎలుకల నుంచి మనుషులకు వ్యాపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ వైరస్‌లు మరో మహమ్మారి ముప్పుపై ఆందోళనను సూచిస్తున్నాయి. కాగా భవిష్యత్ మహమ్మారులను ఎదుర్కొనేందుకు ప్రపంచ ప్రజలను సిద్ధం చేసే దిశగా పరిశోధకులు ఈ ఆవిష్కరణలు సాగిస్తున్నారు.

శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా 700 ఎలుకల నమూనాలను సేకరించారు. వీటిలో ఎనిమిది కొత్త వైరస్ లను కనుగొన్నారు. ఇందులో ఒకటి సార్స్‌-కోవ్‌-2, కోవిడ్‌-19కి కారణమైన వైరస్ కుటుంబానికి చెందినదని గుర్తించారు. గబ్బిలాలపై పలు పరిశోధనలు చేసి ‘బ్యాట్ ఉమెన్’గా పేరు తెచ్చుకున్న శాస్త్రవేత్త డాక్టర్ షి జెంగ్లీ నూతన వైరస్‌లకు సంబంధించి అందించిన వివరాలను వైరోలాజికా సినికా జర్నర్‌లో ప్రచురించారు. కాగా ఈ వైరస్ లు మనుషులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకునేందుకు మరిన్ని పరిశోధనలు చేయాల్నిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. 

వైరోలాజికా సినికా అనేది చైనీస్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ(సీఎస్ఎం)కి చెందిన ప్రచురణ విభాగం. ఇది చైనా ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఎఫైర్స్‌కి చెందినది. శాస్త్రవేత్తలు 201-2021 మధ్య కాలంలో హైనాన్ లో ఎలుకల గొంతు నుంచి 682 నమూనాలను సేకరించారు. ఈ నమూనాలను ఎలుకల జాతులు, అవి ఉంటే ద్వీపాల ఆధారంగా వర్గీకరణ చేశారు. ఈ నేపధ్యంలో జరిగిన పరిశోధనల్లో వాటిలోని వైరస్‌లు వెలుగు చూశాయి. వీటిలో కొన్ని మనిషి ఆరోగ్యానికి ముప్పు తెచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. 
ఇది కూడా చదవండి: యద్ధానికి ముందే హమాస్‌కు ఇరాన్‌ శిక్షణ: ఇజ్రాయెల్‌ ఆరోపణ 

మరిన్ని వార్తలు