రష్యా సంగతి ట్రంప్ కు తెలియదు

15 Jan, 2017 21:21 IST|Sakshi
రష్యా సంగతి ట్రంప్ కు తెలియదు

వాషింగ్టన్:
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ కు ఆ దేశ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) డైరెక్టర్ పెద్ద షాకిచ్చారు. ఈ నెల 20 న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో ట్రంప్ పై సీఐఏ డైరెక్టర్ పదవి నుంచి త్వరలోనే వైదొలగనున్న జాన్ బ్రెన్నన్ ఘాటు పదజాలంతో విరుచుకుపడ్డారు. రష్యా సామర్థ్యాలేంటో, ఆ దేశ ఆంతర్యమేంటో ట్రంప్ కు ఏమాత్రం తెలియదని మండిపడ్డారు.

వేదికలెక్కినప్పుడు సమయస్పూర్తితో మాట్లాడామనుకుంటే సరిపోదని, అలాంటి మాటలతో జాతీయ భద్రతను పరిరక్షించలేరని ట్రంప్ నుద్దేశించి వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నాలుగు రోజుల కిందట ట్రంప్ తొలిసారిగా మీడియాతో మాట్లాడినప్పుడు పుతిన్ పట్ల సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. అమెరికా ఎన్నికల్లో రష్యా ప్రమేయం, తద్వారా ట్రంప్ కు ఉపయోగకరంగా మారిన అంశాలపై ఆ దేశంలో వివాదం చెలరేగిన విషయం కూడా తెలిసిందే.

తనను నాజీ జర్మనీ ఇంటలిజెన్స్ ఏజెన్సీలతో పోల్చడంపై బ్రెన్నన్ మండిపడ్డారు. ఇదేదో ట్రంప్ కు సంబంధించిన వ్యవహారం కానేకాదని, ఇది అమెరికా దేశ భద్రతాపరమైన అంశమన్న విషయం ట్రంప్ మరిచిపోవద్దని బ్రెన్నన్ హెచ్చరించినట్టు స్కై న్యూస్ తెలిపింది. రష్యా ఉద్దేశాలేంటో ట్రంప్ కు అర్థం కాదంటూ ఈసడించుకున్నారు.

మరిన్ని వార్తలు