ఒక్క బుల్లెట్‌ తగిలినా మసే

23 Jun, 2019 04:21 IST|Sakshi
ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌

అమెరికాకు ఇరాన్‌ ఘాటు హెచ్చరిక 

ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత

ఇరాన్‌ గగనతలంలోకి వెళ్లకుండా విమానాలను మళ్లిస్తున్న భారత్‌

టెహ్రాన్‌/వాషింగ్టన్‌: అమెరికా, ఇరాన్‌ ఇంకా మాట లు తూటాలు విసురుకుంటూనే ఉన్నాయి. ఇరాన్‌పైకి యుద్ధ విమానాలు పంపించి మరీ ఆఖరి నిముషంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెనక్కి తగ్గిన నేపథ్యంలో ఇరాన్‌ ఘాటుగా స్పందించింది. తమపై యుద్ధంప్రకటిస్తే మధ్యప్రాచ్య దేశాలన్నీ ప్రమాదంలో పడతాయని హెచ్చరించింది. ‘ఇరాన్‌కి ఒక్క బుల్లెట్‌ గాయమైనా  ఈ ప్రాంతంలో అమెరికా, దాని మిత్రదేశాల ప్రయోజనాలన్నీ మంటల్లో కలుస్తాయి‘‘ అని ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ హెచ్చరించారు.

‘‘మా శత్రువులు ఎవరైనా ముఖ్యంగా అమెరికా, దాని మిత్ర పక్షాలు ఈ ప్రాంతంలో సైనికచర్యలకు దిగితే ఈ ప్రాంతం అంతా మండిపోతుంది‘‘ అని అన్నారు.  గత ఏడాది ఇరాన్‌తో అణు ఒప్పందా న్ని అమెరికా ఏకపక్షంగా రద్దు చేసుకోవడంతో పాటు వివిధ దేశాలపై ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు వద్దంటూ ఆంక్షలు విధించిన దగ్గర్నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్‌ గగనతలంలోకి ప్రవేశించిన అమెరికా డ్రోన్‌ని ఇరాన్‌ కూల్చి వేసిన అవి మరింత పెరిగిపోయాయి. ఇరాన్‌పైకి యుద్ధ విమానాల్ని పంపించిన అధ్యక్షుడు ట్రంప్‌ 150 మంది ప్రాణాలు కోల్పోతారని తెలిసే ఆఖరి క్షణంలో వెనకడుగు వేశారని కథనాలు వెలువడ్డాయి.  

అమెరికా సిబ్బందికి భద్రత పెంపు
అమెరికా, ఇరాన్‌ ఒకరికొకరు కవ్వింపు చర్యలకు దిగుతూ ఉండడంతో ఇరాక్‌ కూడా అప్రమత్తమైంది. ఇరాక్‌లోని అతి పెద్ద వైమానిక స్థావరం బాలాద్‌లో అమెరికా సిబ్బందికి భద్రతను పెంచింది. రాత్రి పూట నిఘా పెంచింది. తనిఖీలు చేపడుతోంది.

ఇరాన్‌కు ప్రాణస్నేహితుడినవుతా: ట్రంప్‌
ఇరాన్‌ అణ్వాయుధాలను త్యజిస్తే గొప్ప  దేశంగా మారుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తెలిపారు. వైట్‌హౌస్‌లో  మీడియాతో మాట్లాడుతూ..‘అణ్వాయుధాలను వదిలిస్తే ఇరాన్‌కు  ప్రాణ స్నేహితుడిని అవుతా. ఇదే జరిగితే ఇరానియన్లు ధనవంతులుగా మారి సంతోషంగా ఉంటారు.  ఇరాన్‌ను మళ్లీ గొప్పగా చేద్దాం’ అని చెప్పారు. ఇరాన్‌ వద్ద అణ్వాయుధాలుండటాన్ని అంగీకరించబోమన్నారు. యుద్ధపిపాసి అన్న వారే తనను ఇప్పుడు శాంతి కపోతంగా అభివర్ణిస్తున్నారని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

విమానాలు దారి మళ్లిస్తున్న భారత్‌
న్యూఢిల్లీ: అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న నేపథ్యంలో భారత్‌ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇరాన్‌ గగనతలంలోకి మన దేశానికి చెందిన విమానాలు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నట్టు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) వెల్లడించారు. ఆ విమానాలన్నింటినీ దారి మళ్లిస్తున్నట్టు తెలిపారు. ‘‘అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. అందుకే అన్ని విమానయాన సంస్థలు కేంద్ర పౌర విమానయాన శాఖతో నిరంతరం సంప్రదింపులు జరపాలి.

ప్రయాణికుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ విమానాలను దారి మళ్లిస్తాం‘‘ అని ట్వీట్‌ చేశారు. బాలాకోట్‌ దాడుల తర్వాత ఇప్పటికే పాకిస్తాన్‌ గగనతలం మీదుగా మన      విమానాలేవీ ప్రయాణించడం లేదు. ఇప్పుడు ఇరాన్‌ మీదుగా వెళ్లకుండా నియంత్రణలు విధిస్తే అమెరికా, యూరోప్‌ దేశాలు, మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లే అంతర్జాతీయ విమానాల పరిస్థితి గందరగోళంలో పడుతుందని ఎయిర్‌ ఇండియా చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అశ్విని లోహాని వ్యాఖ్యానించారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా