'స్వర్గంలో చోటిస్తానన్నా వెళ్లను'

24 Feb, 2016 18:10 IST|Sakshi
'స్వర్గంలో చోటిస్తానన్నా వెళ్లను'

'లివ్ యువర్ పాషన్' నినాదంతో బ్రెజిల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న విశ్వక్రీడలకు.. చిన్నదే అయినా గొప్ప చిక్కొచ్చిపడింది. ముగ్గురు పిల్లల తల్లైన ఓ 59 ఏళ్ల మహిళ.. ఒలంపిక్స్ ప్రధాన స్టేడియాలు నిర్మించే ప్రదేశాన్ని ఖాళీ చేయనుగాక చేయనంటూ భీష్మించుకు కూర్చుంది. ఆమె ఇంటిపక్కనుండే క్రైస్తవ పూజారి కూడా నిర్వాసిత ప్రదేశానికి పోయేదిలేదని తేల్చిచెప్పడంతో వీళ్లను బలవంతంగా తరలించలేక, అలాగని ఆ స్థలాన్ని వదులుకోలేక నానా తంటాలు పడుతున్నారు క్రీడల నిర్వాహకులు.

బ్రెజిల్ లోని రెండో అతిపెద్ద నగరం, దక్షిణ అట్లాంటిక్ తీరంలోని రియో డి జనెరోలో ఆగస్టు 5 నుంచి 2016- ఒలంపిక్స్ ప్రారంభం అవుతాయి. 200కు పైగా దేశాలకు చెందిన 10 వేల మంది క్రీడాకారులు 28 విబాగాల ఈవెంట్లలో పాల్గొంటారు. ఆ మేరకు రియో నగర  నైరుతి ప్రాంతంలో ప్రధాన వేదికలతోపాటు ఆటగాళ్లు బస చేసేందుకు నిర్మాణాలు చేపట్టారు. ఇందుకోసం భారీ ప్యాకేజీ ఇచ్చిమరీ వందలాది కాలనీల్లోని వేలాది మందిని ఖాళీ చేయించారు. వేడుకలకు మరో ఆరు నెలలు మాత్రమే మిగిలి ఉండటంతో పనులు మరింత వేగంగా పరుగుపెడుతున్నాయి. ఇప్పటికే ప్రధాన స్టేడియం పనులు పూర్తికాగా, ఇతర క్రీడాంశాలకు చెందిన స్టేడియాల పనులు జరుగుతున్నాయి. అయితే ఈత కొలను నిర్మాణం మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ఎందుకంటే  మార్సియా(59), హొయిసా బెట్రో(45) వాళ్ల ఇల్లులు కూలగొడితేగానీ అది సాధ్యం కాదు.ఆ కాలనీలో నివసించిన 600కు పైగా కుటుంబాలు ఇప్పటికే నిర్వాసిన ప్రాంతానికి వెళ్లిపోగా, వీళ్లిద్దరు మాత్రం అక్కడే ఉండిపోయారు. 'అదేంటమ్మా.. ఇంత మంచి ప్యాకేజీ ఇచ్చాం కదా.. మీరూ వెళ్లిపోవచ్చుకదా'అని నిర్మాణ సంస్థ ప్రతినిధులెవరైనా తనను ప్రశ్నిస్తే.. 'పాతికేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నా. ఈ ప్రదేశమంటే నాకెంతో ఇష్టం. ఇదిగాక స్వర్గంలో చోటిస్తానన్నా వెళ్లను'అని గట్టిగా జవాబిస్తుంది. ఇక ఇళ్లు వదిలి వెళ్లకపోవడానికి బెట్రోకు మరో కారణం ఉంది. కంపెనీ చూపించిన నిర్వాసిత ప్రాంతం.. శాపానికి గురైన దెయ్యాల దిబ్బ అని అతడి నమ్మకం. అక్కడికి వెళితే దుష్టశక్తులు తనను కాల్చుకుతింటాయని భయం.ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో నిర్మాణ సంస్థ.. ఆ రెండు ఇళ్ల చుట్టూ ఇనుప కంచెను నిర్మించి ఒకరకమైన నిర్బంధాన్ని విధించింది. ఇది తెలుసుకున్న మార్సియా, బెట్రోల బంధవులు కంచెలు తొలగించాలని ఆందోళన చేస్తున్నారు. విశ్వక్రీడలు ప్రారంభం అయ్యేనాటికి ఒక వేళ ఆ రెండు ఇళ్లు అలాగే ఉంటే బహుశా ఆ ఇద్దరిదీ 'ప్రపంచ స్థాయి భూపోరాటం' అనక తప్పదేమో!

 

మరిన్ని వార్తలు