జయలలిత ఎక్కడ? | Sakshi
Sakshi News home page

జయలలిత ఎక్కడ?

Published Wed, Feb 24 2016 6:08 PM

జయలలిత ఎక్కడ?

చెన్నై: తమిళనాడు సీఎం జయలలిత పుట్టినరోజు ఆమె అభిమానులకు పండుగ రోజు. అందుకే వారు జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. జయ 68వ పుట్టినరోజు సందర్భంగా 122 దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మ జన్మదినం నాడు పుట్టిన ఆడపిల్లలకు రూ.10,000 డిపాజిట్ చేస్తామని చెన్నై కార్పొరేషన్ ప్రకటించింది. మరో అన్నాడీఎంకే నేత ఈ రోజు పుట్టిన శిశువులకు బంగారు ఉంగరాలు చేయిస్తానని ప్రకటించాడు. చెన్నై మేయర్ దురాయ్ సామి ఈ రోజు అమ్మా క్యాంటిన్స్‌లో ఉచితంగా భోజనం పెడతామని తెలిపారు. చెన్నైలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో ఆమె అభిమానులు 68 కేజీల భారీ కేకును కట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు సీఎం జయలలితకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.  ఆమె ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని ట్వీట్ చేశారు.

ఇలా భారీ హంగామా నడుమ అన్నాడీఎంకే శ్రేణులు అమ్మ జన్మదిన వేడుకలు నిర్వహించగా.. మరోవైపు ప్రతిపక్ష పార్టీ డీఎంకే మాత్రం జయలలిత ఎక్కడ అంటూ దినపత్రికల్లో భారీ ప్రకటనలు ఇచ్చింది. ప్రచారార్భాట్లో కనిపించడం మినహా ఆమె ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కనిపించడం లేదని విమర్శలు గుప్పించింది. ‘‘జయలలిత టీవీలు, స్టికర్లలలోనే కనబడుతున్నారు. మీకు ఎవరికైనా ఆమె వ్యక్తిగతంగా కనబడ్డారా?’’ అంటూ ఆ ప్రకటనల్లో తమిళనాడు ప్రజల్ని ఉద్దేశించి ప్రశ్నించింది. ఇందుకు పోటీగా అన్నాడీఎంకే మద్దతుదారులు కూడా ‘‘కరుణానిధి సినీ నటులతోనూ, టీవీ కార్యక్రమాల్లోనే కనబడుతున్నారా. ఎప్పుడైనా అసెంబ్లీలో కనిపించారా..?’’ అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో ఇలా ప్రత్యర్థి పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేసుకుంటున్నారు.
 

Advertisement
Advertisement