ఫిలిప్పీన్స్‌లో తుపాను బీభత్సం 1200 మంది మృతి?

10 Nov, 2013 02:03 IST|Sakshi
ఫిలిప్పీన్స్‌లో తుపాను బీభత్సం 1200 మంది మృతి?

 మనీలా: ఫిలిప్పీన్స్ మధ్య ప్రాంతాన్ని శక్తిమంతమైన తుపాను అతలాకుతలం చేసింది.  తుపాను బీభత్సానికి 1200 మందికి పైగా మరణించి ఉంటారని సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న రెడ్‌క్రాస్ సంస్థ అంచనా వేసింది. అయితే ప్రభుత్వం మాత్రం 138 మంది మరణించారని పేర్కొంది. కాగా, 315 కి.మీ వేగంతో ఈ తుపాను ఫిలిప్పీన్స్ మధ్య ప్రాంతంలోని దీవులపై శుక్రవారం విరుచుకుపడింది. సునామీ తరహాలో మూడు మీటర్ల ఎత్తున ఎగిసిపడిన అలల ధాటికి తీరంలో ఉన్న వేలాది ఇళ్లు నేలమట్టమైపోయాయి. తీరం నుంచి ఒక కిలోమీటర్ వరకూ కూడా తుపాన్ ప్రభావం బలంగా పడింది.
 
  అంతా సర్వనాశనం అయిపోయిందని తుపాను తీవ్రతకు తీవ్రంగా నష్టపోయిన లెట్ పట్టణంలో పర్యటించిన మంత్రి మార్ రోక్సస్ ఆవేదన వెలిబుచ్చారు. టకోబాన్ పట్టణంలో తుపాను బీభత్సానికి 100 మందికి పైగా మరణించారని, తీరాన్ని అనుకుని ఉన్న ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ అలల దెబ్బకు కకావికలమైందని అధికారులు తెలిపారు. రోడ్లన్నీ పాడైపోయాయని, సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని వెల్లడించారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు.

మరిన్ని వార్తలు