ఐక్యరాజ్యసమితికి నిధుల కొరత!

9 Oct, 2019 22:45 IST|Sakshi

న్యూయార్క్‌: ప్రపంచ సమస్యలు తీర్చే పెద్దన్న ఐక్యరాజ్యసమితిని నిధుల కొరత వేదిస్తోంది. ఐక్యరాజ్యసమితి సుమారు 230 మిలియన్‌ డాలర్ల లోటులో ఉన్నట్లు సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ వెల్లడించారు. అరకొరగా ఉన్న నిధులు ఈ నెలాఖరుకు ఖాళీ అయ్యే అవకాశముందని తెలిపారు. సమితి సచివాలయంలో పనిచేసే ఉద్యోగులను ఉద్దేశించి ఆయన రాసిన లేఖలో నిధుల కొరతను ఆయన ప్రస్తావించారు. ‘ఈ ఏడాది సాధారణ బడ్జెట్‌కు సభ్య దేశాల నుంచి కేవలం 70శాతం మాత్రమే నిధులు లభించాయి. దీంతో సెప్టెంబర్‌ ఆఖరుకు 230 మిలియన్‌ డాలర్ల నగదు లోటు ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న నిధులు సైతం ఈ నెలాఖరుకు అయిపోయే అవకాశం ఉంది. అందుకే ఖర్చు తగ్గింపులో భాగంగా వివిధ సమావేశాలు, సదస్సులు వాయిదా వేయను న్నాం. కొన్ని సేవలను తగ్గించనున్నాం. అతిముఖ్యమైన పర్యటనలు తప్ప మిగిలిన వాటిపై ఆంక్షలు విధించనున్నాం. ఈ పరిస్థితికి కారణం సభ్యదేశాల నిర్లక్ష్యమే’అని ఆ లేఖలో గుటెర్రస్‌ పేర్కొన్నారు. కాగా, నగదు కొరత ప్రమాదాన్ని ముందే ఊహించిన గుటెర్రస్‌ ఈ ఏడాది ఆరంభంలోనే సభ్య దేశాలను హెచ్చరించారు. ఆయా దేశాలు చెల్లించాల్సిన మొత్తాన్ని వీలైనంత త్వరగా జమచేయాలని సూచించారు. 2018–19కి గాను సమితి 5.4 బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌ను ప్రకటించగా, ఇందులో 22శాతం నిధులు అమెరికా నుంచి వచ్చినవే.

మరిన్ని వార్తలు