కోవిడ్‌-19 : వ్యాక్సిన్‌ కోసం భారీ నిధులు

8 Jul, 2020 09:02 IST|Sakshi

బయోటెక్‌ కంపెనీలకు నిధుల వరద

వాషింగ్టన్‌ : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న క్రమంలో వ్యాక్సిన్‌ తయారీని వేగవంతం చేసేందుకు అమెరికా పలు చర్యలు చేపడుతోంది. బయోటెక్‌ కంపెనీ నోవావ్యాక్స్‌ అభివృద్ధి చేసే కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ కోసం దాదాపు 12,000 కోట్ల నిధులను సమకూర్చనున్నట్టు  అమెరికా ప్రకటించింది. ఆరోగ్య, మానవసేవల విభాగంతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ ఏడాది చివరికి 10 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను సరఫరా చేసేందుకు నోవావ్యాక్స్‌ అంగీకరించింది. కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో తమ ప్రజలను కాపాడుకునేందుకు వ్యాక్సిన్‌ తయారీని వేగవంతం చేస్తామని నోవావ్యాక్స్‌ సీఈఓ స్టాన్లీ ఎర్క్‌ వెల్లడించారు. ఎన్‌వీఎక్స్‌-కోవీ2373గా పిలిచే ఈ వ్యాక్సిన్‌ ప్రస్తుతం చివరి దశ ప్రయోగాల్లో ఉంది. కీలక ట్రయల్స్‌ను పూర్తి చేసి సంవత్సరాంతానికి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నోవావ్యాక్స్‌ శ్రమిస్తోంది.

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో కలిసి ఆస్ర్టాజెనెకా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ కోసం అమెరికా దాదాపు 9 కోట్ల రూపాయలు వెచ్చిస్తుండగా అంతకన్నా అధిక మొత్తంలో నిధులను నోవావ్యాక్స్‌కు సమకూరుస్తోంది. ఆపరేషన్‌ వార్ప్‌ స్పీడ్‌ కింద 2021లో సురక్షిత, సమర్థ వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకువచ్చి కోట్లాది డోసులను ప్రజలకు సరఫరా చేయాలని అమెరికా నిర్ణయించింది. మరోవైపు కోవిడ్‌-19 యాంటీబాడీ చికిత్సకు ఉపయోగించే ఔషధాలను తయారుచేసే న్యూయార్క్‌కు చెందిన రీజెనెరాన్‌కు కూడా అమెరికా భారీగా నిధులను అందచేయనున్నట్టు ప్రకటించింది. కరోనా వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌ను నిరోధించే రెండు యాంటీబాడీలతో కూడిన డ్రగ్‌ కాంబినేషన్‌ను ఆర్‌ఈజీఎన్‌-కోవ్‌2 పేరుతో అభివృద్ధి చేయనున్నట్టు రీజెనెరాన్‌ ప్రకటించింది. గత ఏడాది ఈ సంస్థ అభివృద్ధి చేసిన యాంటీబాడీ డ్రగ్‌ ఎబోలా వైరస్‌ను దీటుగా ఎదుర్కొంది.చదవండి : ‘పీసీఆర్‌’తోనే కోవిడ్‌పై స్పష్టత!

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా