కోవిడ్‌ కోరల్లో 57 దేశాలు

29 Feb, 2020 02:01 IST|Sakshi
కోవిడ్‌ నుంచి కాపాడుకునేందుకు ప్రత్యేక దుస్తులు ధరించిన దక్షిణకొరియాలోని డేగు ఆస్పత్రి సిబ్బంది

ద.కొరియా, జపాన్‌ దేశీయుల వీసా తాత్కాలిక నిలిపివేత: భారత్‌

భారత్‌ సామర్థ్యంపై అమెరికా ఇంటెలిజెన్స్‌ పరిశీలన

బీజింగ్‌: కోవిడ్‌ ధాటికి ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. ఒకవైపు చైనాలో కొత్త కేసుల సంఖ్య తగ్గుతూ ఉంటే, బాధిత దేశాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఈ వైరస్‌ న్యూజిలాండ్, లిథువేనియాలకు సోకింది. ఇప్పటివరకు 57 దేశాలకు ఈ వ్యాధి వ్యాపించి వణుకు పుట్టిస్తోంది. చైనా ప్రభుత్వ లెక్కల ప్రకారం శుక్రవారం ఒక్కరోజే 44 మంది మరణించారు. దీంతో ఆ దేశంలో మృతుల సంఖ్య 2,780 దాటింది. ప్రపంచవ్యాప్తంగా 83 వేల మందికి పైగా చికిత్స పొందుతున్నారు. కోవిడ్‌ బారిన పడిన దేశాల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో భారత్‌ అప్రమత్తమైంది.

దక్షిణ కొరియా, జపాన్‌ దేశాల నుంచి వచ్చే వారి వీసాలను తాత్కాలికంగా నిలిపివేసింది.  దక్షిణ కొరియాలో ఇప్పటివరకు 13 మంది ఈ వ్యాధితో మరణిస్తే, కేసులు 2 వేలు దాటిపోయాయి. జపాన్‌ షిప్‌లో ఉన్న ప్రయాణికుల్లో కూడా చాలా మందికి కరోనా వైరస్‌ సోకడంతో ఈ రెండు దేశాల నుంచి వీసాల జారీని తాత్కాలిక రద్దు చేసినట్టుగా భారత్‌ వెల్లడించింది. ఇటలీ, ఇరాన్‌లో కూడా కేసులు భారీగా పెరిగాయి.  ఇరాన్‌లో తమిళనాడుకు చెందిన 450 మంది ,గుజరాత్‌కు చెందిన 350 మంది జాలర్లు చిక్కుకుపోయారు. వారిని స్వదేశానికి తిరిగి తేవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరాయి.

రంగంలోకి అమెరికా ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు  
కోవిడ్‌–19 విస్తరించిన దేశాల సంఖ్య 50 దాటిపోవడంతో అమెరికా ఇంటెలిజెన్స్‌ అధికారులు రంగంలోకి దిగారు. ఈ వైరస్‌ను ఎదుర్కొనే సామర్థ్యం ఏయే దేశాలకు ఉంది ? వేటికి లేదు అన్న దిశగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా భారత్‌లో జనాభా ఎక్కువ కావడం, ఆరోగ్య సదుపాయాలు అందరికీ అందుబాటులో లేకపోవడంతో ఈ వైరస్‌ను ఎలా ఎదుర్కొంటారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు భారత్‌లో మూడు కేసులు నిర్ధారణ అయ్యాయి. వారు కోలుకున్నారు కూడా. మరో 23,531 మందిని కరోనా వైరస్‌ సోకిందన్న అనుమానంతో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.

మరిన్ని వార్తలు