జెరూసలేం’ తీర్మానంపై అమెరికా వీటో

20 Dec, 2017 01:17 IST|Sakshi

ఆరేళ్లలో తొలిసారి విశిష్ట హక్కు ప్రయోగం

వాషింగ్టన్‌: జెరూసలేంను ఇజ్రాయెల్‌ రాజధానిగా గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని యూఎస్‌ వీటో చేసింది. ఆరేళ్ల కాలంలో, ట్రంప్‌ హయాంలో అమెరికా ఈ హక్కును వినియోగించుకోవడం ఇదే తొలిసారి. ఈజిప్టు రూపొందించిన ఈ తీర్మానాన్ని భద్రతా మండలిలో అమెరికా మిత్ర దేశాలైన జపాన్, ఫ్రాన్స్, బ్రిటన్‌ కూడా సమర్థించాయి.

50 ఏళ్లుగా జెరూసలేంపై ఇజ్రాయెల్‌ సార్వభౌమ హక్కులను వ్యతిరేకిస్తున్న భద్రతా మండలి మరోసారి అదే వైఖరిని ఉద్ఘాటించింది. ట్రంప్‌ నిర్ణయంతో మధ్యప్రాచ్య ప్రాంతంలో శాంతి పునరుద్ధరణ ప్రక్రియకు విఘాతం కలుగుతుందని, అది ఉగ్రవాదులకు ఊతంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. జెరూసలేంలో దౌత్య కార్యాలయాలు ఏర్పాటుచేసుకోవద్దని కోరింది. ఈ అంశంపై సోమవారం జరిగిన ఓటింగ్‌లో అమెరికా వీటో హక్కు ప్రయోగించడాన్ని ఆ దేశ రాయబారి నిక్కీ హేలీ సమర్థించారు. తమ దౌత్య కార్యాలయం టెల్‌అవీవ్‌లోనే కొనసాగుతుందని బ్రిటన్‌ స్పష్టం చేసింది.

>
మరిన్ని వార్తలు